మళ్లీ రియల్ ఊపు!

14 Nov, 2013 01:49 IST|Sakshi

 =పీసీపీఐఆర్‌తో స్థిరాస్తి వ్యాపారం జోరు
 =వ్యాపారుల్లో కొత్త ఉత్సాహం  
  =భూముల ధరలకు రెక్కలు

 
యలమంచిలి, న్యూస్‌లైన్ : ఇన్నాళ్లూ పడకేసిన రియల్ ఎస్టేట్ మళ్లీ పరుగులు తీస్తోంది. విశాఖ-కాకినాడ మధ్య ఏర్పాటు చేయతలపెట్టిన భారీ పారిశ్రామిక సముదాయం - పీసీపీఐఆర్ పుణ్యమాని స్థిరాస్తి వ్యాపారం జోరు పెరిగింది. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని పది మండలాల్లో 97 గ్రామాల పరిధిలో దాదాపు 64 వేల హెక్టార్లను సేకరించ బోతూ ఉండడంతో ఇక రియల్ ఎస్టేట్ రంగానికి నవ్యోత్సాహం సమకూరబోతోందన్నఆశావహ వ్యాఖ్యలు వినవస్తున్నాయి. దాంతో సహజంగానే భూముల ధరలకు రెక్కలు వస్తున్నాయి.

రియల్ ఎస్టేట్ వ్యాపారం మరోసారి పరుగు ప్రారంభించనుంది. జిల్లాలో రియల్ వ్యాపారం  గత మూడేళ్లుగా గత మూడేళ్లుగా చతికిలబడింది. మళ్లీ లేచేదెప్పుడోనని అంతా నిరాశ పడుతున్న వేళ,, విశాఖపట్నం-కాకినాడల మద్య పీసీపీఐఆర్ ఊపిరినిచ్చింది. ఇప్పుడు అమ్మకందారుల్లో, వ్యాపారుల్లో కొత్త ఉత్సాహానికి తెర తొలగింది. గతంలో అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్ ఏర్పాటుతో గ్రామీణ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది.  వేలల్లో  ఉన్న వ్యవసాయ భూముల ధరలు లక్షలకు చేరాయి.  ప్లాట్‌లు, టౌన్‌షిప్‌ల నిర్మాణానికి పెద్దయెత్తున వ్యవసాయ భూములను కొనుగోలు చేశారు.  

జాతీయరహదారిని ఆనుకుని ఉన్న భూముల ధరలు ఎకరా రూ. 30 నుంచి 40లక్షల వరకు పలికాయి.  రియల్ వ్యాపారులు కోట్లలో పెట్టుబడులు పెట్టారు. అయితే అది గాలి బుడగ చందమైంది. జిల్లాలో ఆశించిన మేరకు పరిశ్రమలు రాకపోవడం, పరిశ్రమలకు భూములివ్వడానికి రైతులు నిరాకరించడం వంటి  కారణాలవల్ల రియల్ రంగం వెలవెలపోయింది. కళతప్పింది. దాంతో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు దాదాపు నిలిచిపోయాయి.  
 
పీసీపీఐఆర్.. ఆసరా


ఇటువంటి నిరాశాకర వాతావరణంలో పీసీపీఐఆర్ ప్రకటన వ్యాపారులకు ఊరటనిచ్చింది. తీరప్రాంతంలో పీసీపీఐఆర్ ఏర్పాటు ప్రకటన ఐదేళ్ల క్రితం వెలువడింది. దాంతో రియల్ వ్యాపారులు తీరప్రాంతంలో పెద్దయెత్తున భూములను కొనుగోలుచేశారు.  విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో 10 మండలాల్లో 97 గ్రామాల పరిధిలో దాదాపు 64 వేల హెక్టార్లను సేకరించనున్నట్టు వార్తలు వెలువడ్డాయి. దాంతో రియల్ రంగం బాగా విస్తరించనుందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. భూ సేకరణను నియంత్రిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలను ఆమోదించిన విషయం తెలిసిందే.

భూములకు మార్కెట్ ధరకంటే మూడు రెట్లు నష్టపరిహారం అందజేయాలని, రైతుల ఆమోదంమేరకే భూములను సేకరించాలన్న నిబంధనలు రైతులకు ప్రయోజనకరంగా కనిపిస్తున్నాయి. అంతే కాక, రియల్ వ్యాపారం జోరు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  పీసీపీఐఆర్ పరిధిలోని గ్రామాల్లో భూముల క్రయవిక్రయాల సందడి నెలకొంది.  రియల్ వ్యాపారులు కూడా తీరంలో ఏయే గ్రామాల్లో భూములను కొనుగోలు చేస్తే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయో లెక్కలు వేసుకుంటున్నారు.

ప్రస్తుతం రూ. 3 నుంచి రూ.4 లక్షల వరకు ధరలు ఉన్న భూములకు, పీసీపీఐఆర్ ప్రకటన నేపథ్యంలో రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు పరిహారం అందించవచ్చన్న ప్రకటలతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరిన్ని భూములు కొనుగోలుచేయడానికి సిద్దపడుతున్నారు.   జిల్లాలో మైదాన ప్రాంతాల్లో కూడా భూముల క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి.  పీసీపీఐఆర్ ప్రకటలతో జాతీయరహదారిని ఆనుకుని భూముల ధరలకు రెక్కలొచ్చాయి.  ఇప్పటివరకు రూ. 30 నుంచి రూ. 40 లక్షల వరకు ఉన్న భూముల ధరలు రూ. 50 లక్షలకు పైబడి పలుకుతున్నాయి.  
 

మరిన్ని వార్తలు