అంత్యక్రియలు చేస్తుండగా నాడి కొట్టుకుంటోందని గ్రహించి

30 Oct, 2019 08:21 IST|Sakshi
ఆలూరు ప్రభుత్వాస్పత్రిలో బాలుడిని పరీక్షిస్తున్న వైద్యులు

సాక్షి, హొళగుంద: మృతి చెందిన వాడు మళ్లీ జీవం పోసుకొని కదిలితే..లోకాన్ని విడిచి వెళ్లిన బాలుడి నాడి కొట్టుకుంటూ ఉంటే..రోదిస్తున్న కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆశలను బతికించుకునేందుకు వారు పడే ఆరాటం అంతా ఇంతా కాదు. కర్నూలు జిల్లా హొళగుంద మండలం సుళువాయి గ్రామంలో ఇలాంటి ఘటనే మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పింజరి పీరుసాబ్, శేఖన్‌బీకి కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడైన రహిబ్‌అలి (5) స్థానిక ప్రైవేటు పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. ఈ నెల 27న రహిబ్‌ అలి అనారోగ్యంతో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులు, బంధువులు బళ్లారిలో ఓ ఆస్పత్రిలో చేర్పించారు.

మంగళవారం ఉదయం బాలుడు కోలుకోలేక మృతి చెందినట్లు అక్కడి వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు సుళువాయి గ్రామానికి మృతదేహాన్ని తీసుకొచ్చారు. సాయంత్రం ముస్లిం ఆచారం ప్రకారంగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేపట్టారు. ఈ సమయంలో బాలుడి కాళ్లు కదిలాయని, శ్వాస కొద్దిగా ఆడుతుందని కొందరు గమనించి చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు ఆశతో బాలుడిని ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. గ్రామస్తులు కూడా వారితోపాటు ఆస్పత్రికి వెళ్లారు. అయితే  అక్కడి వైద్యలు పరీక్షించి బాలుడు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దీంతో చేసేదేమి లేక మృతదేహాన్ని తిరిగి స్వగ్రామానికి తీసుకొచ్చారు. బతుకుతాడనుకున్న కుమారుడు మృతి చెందినట్లు తేలడంతో కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు.  

మరిన్ని వార్తలు