సీఎం పర్యటన నిరాశ మిగిల్చింది

11 Aug, 2014 02:24 IST|Sakshi
సీఎం పర్యటన నిరాశ మిగిల్చింది

బుచ్చెయ్యపేట: అభివృద్ధి పథకాలకు నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఒక్క పథకానికీ నిధులు ప్రకటించక పోవడం నిరాశ మిగిల్చిందని చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం బుచ్చెయ్యపేటలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం విశాఖ వస్తున్నందున వరాల జల్లు కురిపిస్తారని ఆశించానన్నారు.

నిధులు మంజూరుచేయాలని స్వయాన సీఎంకి విన్నవించినా ఒక్క దానికీ ఆమోదం తెలపకపోవడం కార్యకర్తలకు కూడా విస్మయం కలిగించిందన్నారు. వడ్డాది, కొత్తకోట, రోలుగుంటలలో డిగ్రీ కళాశాలలు మంజూరు చెయ్యాలని కోరినట్లు చెప్పారు. బుచ్చెయ్యపేట, చోడవరం మండలాలకు కోనాం రిజర్వాయర్ నీరు తరలించే ఏర్పాట్లు చేయాలని,  30 పడకల ఆస్పత్రులు మంజూరు చేయాలని, మినీ రిజర్వాయర్లు ఏర్పాటు చేయాలని, నిరుద్యోగ, మహిళ, రైతుల్ని ఆదుకోవాలని వినతులు అందించినట్లు తెలిపారు.

ఒక్కదానిపైనా ప్రకటన లేకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని, ముఖ్యమంత్రిని ఎన్నిసార్లు అవసరమైతే అన్నిసార్లు కలిసి నిధులు తెచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ దాడి సూరినాగేశ్వరరావు, విశాఖ డెయిరీ డెరైక్టర్ గేదెల సత్యనారాయణ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వియ్యపు అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు