రాజ్యసభ ఎన్నికల బరిలోకి రెబెల్స్ రంగ ప్రవేశం!

29 Jan, 2014 01:18 IST|Sakshi
  • 6 సీట్లు.. 9 నామినేషన్లు
  •  బరిలో ముగ్గురు తిరుగుబాటు అభ్యర్థులు.. రాజ్యసభ పోరు రసవత్తరం
  •   కాంగ్రెస్ నుంచి కేవీపీ, టీఎస్‌ఆర్, ఎం.ఎ.ఖాన్ 
  •   రెబెల్ అభ్యర్థులుగా చైతన్యరాజు, ఆదాల 
  •   టీడీపీ నుంచి గరికపాటి, సీతారామలక్ష్మి; టీఆర్‌ఎస్ నుంచి కేకే పోటీ
  •   {శమజీవి పార్టీ తరఫున జాజుల భాస్కర్ అనూహ్య నామినేషన్ 
  •   ముగిసిన నామినేషన్ల ఘట్టం...
  •   రెబెల్స్‌కు మద్దతిచ్చిన ఎమ్మెల్యేలపై బొత్స ఫైర్ 
  •   తిరుగుబాటు అభ్యర్థుల వెనుక సీఎం హస్తం?
  •  
     సాక్షి, హైదరాబాద్:  ఊహించినట్లుగానే రాజ్యసభ ఎన్నికల్లో రెబెల్స్ రంగ ప్రవేశం చేశారు. కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు అభ్యర్థులు పార్టీపై తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేయటంతో రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. నామినేషన్లు దాఖలు చేయడానికి మంగళవారం సాయంత్రం 3 గంటలతో గడువు ముగియగా మొత్తం 9 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. వీరిలో కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించిన ముగ్గురు అభ్యర్థులు కె.వి.పి.రామచంద్రరావు, ఎం.ఎ.ఖాన్, టి.సుబ్బిరామిరెడ్డి, టీడీపీ తరఫున ఇద్దరు అభ్యర్థులు గరికపాటి మోహనరావు, తోట సీతారామలక్ష్మి, టీఆర్‌ఎస్ నుంచి కె.కేశవరావులు నామినేషన్లు వేశారు. పెద్దల సభకు పోటీ చేస్తానని ముందు నుంచీ చెప్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ కె.వి.వి.సత్యనారాయణరాజు (చైతన్యరాజు) తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జె.సి.దివాకర్‌రెడ్డి కూడా నామినేషన్ వేయాలని భావించినప్పటికీ విరమించుకోగా.. చివరి నిమిషంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి అనుహ్యంగా స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. వీరు కాకుండా శ్రమజీవి పార్టీ తరఫున జాజుల భాస్కర్ కూడా చివరి నిమిషంలో నామినేషన్ దాఖలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
     
    అయితే.. ఆయనను టీడీపీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఒక్కరు మాత్రమే బలపరిచారు. దాంతో జాజుల నామినేషన్ తిరస్కరణ ఖాయమని తేలిపోయింది. మిగిలిన ఎనిమిది మందిలో ఎవరైనా నామినేషన్లను ఉపసంహరించుకుంటారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉన్నాయో లేదో ఎన్నికల అధికారులు బుధవారం పరిశీలించి.. బరిలో ఉన్న వారి జాబితాను ప్రకటిస్తారు. ఈ నెల 31తో (శుక్రవారం) నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. ఈలోపు మిగిలిన అభ్యర్థుల్లో ఎవరూ నామినేషన్లను ఉపసంహరించుకోని పక్షంలో ఎన్నికలు అనివార్యం అవుతాయి. అసమ్మతి ఎమ్మెల్యేలతో గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటున్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు రాజ్యసభ ఎన్నికలు శరాఘతమే కానున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు పెద్ద తలనొప్పిగా మారాయి. రెబల్ అభ్యర్థులుగా బరిలో దిగిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి, చైతన్యరాజులను పోటీ నుంచి తప్పించేందుకు శతవిధాలా కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ తాము ఖచ్చితంగా పోటీచేసి తీరుతామని ఇరువురు నేతలు ఘంటాపథంగా చెప్తున్నారు. 
     
     41 ఓట్లు వస్తేనే గెలుపు... 
     - ఆరు స్థానాలకుగానూ 9 మంది రంగంలో దిగటంతో అభ్యర్థులు మద్దతు కూడగట్టటంలో జోరుగా మంతనాలు సాగిస్తున్నారు. ఒక నామినేషన్ తిరస్కరణ అవకాశం ఉండగా.. మిగిలిన 8 మంది బరిలో నిలిచినట్లయితే క్రాస్‌ఓటింగ్ తప్పదని పరిశీలకులు అంటున్నారు. 
     - శాసనసభలో ప్రస్తుతం 15 స్థానాలు ఖాళీగా ఉండగా, ఇద్దరికి ఓటు హక్కు లేదు. ఈ లెక్కన మిగిలింది 278 సభ్యులు మాత్రమే. అభ్యర్థుల గెలుపు కోసం కోటా ఓట్లు 40.71 గా లెక్కేశారు. ఈ లెక్కన 41 ప్రథమ ప్రాధాన్యత ఓట్లు వచ్చిన వారు గెలుపొందినట్లు ప్రకటిస్తారు. 
     - శాసనసభలో ఇప్పుడున్న బలం మేరకు టీడీపీ కూడా రెండు స్థానాలను గెలుచుకోవటానికి అవసరమైన సంఖ్యా బలం లేదు. ఈ పరిస్థితుల్లో క్రాస్ ఓటింగ్‌పై నేతలు ఆందోళన చెందుతున్నారు.
     
     రెబల్స్‌కు మొదలైన బెదిరింపులు...
     రాజ్యసభ బరిలో దిగిన రెబల్ అభ్యర్థులు ఆదాల ప్రభాకర్, చైతన్యరాజులను పోటీ నుంచి తప్పించేందుకు హైకమాండ్ పెద్దలు బెదిరింపులకు దిగుతున్నట్లు తెలుస్తోంది. నామినేషన్లను ఉపసంహరించుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించినట్లు సమాచారం. 
     - రెబల్స్‌కు మద్దతుగా నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసిన ఎమ్మెల్యేలందరినీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పిలిపించుకుని మాట్లాడారు. తక్షణమే మద్దతను ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. కొందరి నుంచి మద్దతు ఉపసంహరణ లేఖలను రాయించుకున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరణ లేఖలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ రాజసదారాంకు కూడా అందజేశారు. వాటిని ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలనకు పంపగా, వారు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు.
     
     - కాంగ్రెస్ ఎమ్మెల్యేలెవరూ చేజారిపోకుండా ఉండేందుకు పార్టీ అధిష్టానం ఏఐసీసీ కార్యదర్శులు తిరునావక్కరసార్, ఆర్.సి.కుంతియాలను హైదరాబాద్ పంపింది. వీరిద్దరు మంగళవారం అసెంబ్లీ వద్దకు వచ్చి కిరణ్, బొత్సలతో మంతనాలు జరిపారు. ఆ తరువత సీఎల్‌పీ కార్యాలయంలో మకాం వేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పిలిపించుకుని మాట్లాడారు. అనుమానమున్న నేతలను బుజ్జగించేందుకు యత్నించారు.
     
     తిరుగుబాటు అభ్యర్థుల్లో ఆందోళన... 
     తిరుగుబాటు అభ్యర్థులకు మద్దతిచ్చిన ఎమ్మెల్యేలు కొందరు యూ-టర్న్ తీసుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి లేఖలు ఇచ్చారని, వారి నామినేషన్లు చెల్లవని ప్రచారం జరగటంతో ఆదాల, చైతన్యరాజులు ఆందోళనలో పడ్డారు. 
     
     - చైతన్యరాజు తన కుమారుడు, మరో ఎమ్మెల్సీ రవికిరణ్‌వర్మను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వద్దకు పంపినట్లు తెలిసింది. సీఎంతో సమావేశానంతరం రవికిరణ్‌వర్మ బయటకు వచ్చిన తర్వాత.. నామినేషన్ల ప్రక్రియ గడువు మరో రెండు నిమిషాల్లో ముగుస్తుందనగా చైతన్యరాజు హడావుడిగా రెండో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. 
     
     - మరో రెబల్ అభ్యర్థి ఆదాల మంగళవారం సాయంత్రం ఎన్నికల రిటర్నింగ్ అధికారి సదారాంను కలిసి ఏం జరుగుతోందని ఆరా తీశారు. నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తామని సదారాం చెప్పటంతో ఆయన వెనుదిరిగారు. తన నామినేషన్‌ను చెల్లకుండా చేసేందుకు కొందరు నేతలు కుట్ర పన్నారని, అందులో భాగంగా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ఆదాల ఆరోపించారు. 
     
     రెబల్స్ వెనుక సీఎం హస్తం?
     కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన చైతన్యరాజు, ఆదాల ప్రభాకర్‌రెడ్డిల వెనుక ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హస్తం ఉందని సొంత పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. వీరిద్దరు నామినేషన్లు దాఖలు చేయడానికి ముందు సీఎంను పలుమార్లు కలిసి వెళ్లారు. వీరికి మద్దతుగా సంతకాలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ప్రతి రోజూ సీఎంను కలుస్తున్న వారే కావడంతో ఆయన ప్రోద్బలం మేరకే వారు నామినేషన్లు వేసినట్లు చెప్తున్నారు. ఈ విషయంలో సీమాంధ్ర మంత్రులు పి.బాలరాజు, కొండ్రు మురళీమోహన్ సహా పలువురు ఎమ్మెల్యేలు ఏఐసీసీ కార్యదర్శులను కలిసి.. రెబల్స్ వెనుక ఉన్న అదశ్యశక్తి ఎవరో గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళతామని ఆయా ఏఐసీసీ నేతలు హామీ ఇచ్చినట్లు తెలిసింది. 
     
     ఒక్కసారి కమిట్ అయితే... అంతే!
     రాజ్యసభ ఎన్నికల్లో పోటీలో దిగిన అభ్యర్ధి నామినేషన్ పత్రాలపై సంతకం చేస్తే వాటిని ఉపసంహరించుకునే వీలులేదా...? అవుననే చెబుతున్నాయి ఎన్నికల సంఘం అధికార వర్గాలు. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులుగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి, చైతన్యరాజులకు మద్దతుగా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ పెద్దల నుంచి వచ్చిన సంకేతాలు, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ హెచ్చరికల నేపథ్యంలో వారు పునరాలోచనలో పడ్డారు. వీరిలో ముత్యాలపాప, కె.మురళీకృష్ణ, జీవీ శేషు, యై వెంకటేశ్వర్‌రెడ్డితోపాటు మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు రెబల్ అభ్యర్థులకు మద్దతును ఉపసంహరించుకుంటామని పేర్కొంటూ రాసిన లేఖలను బొత్సకు అందజేశారు. వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కూడా అందజేశారు.  వాటిని ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలనకు పంపగా, వారు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆదాల, చైతన్యరాజు నామినేషన్లు చెల్లవనే ప్రచారం జోరందుకుంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా పనిచేసిన అధికారి ఒకరు మాట్లాడుతూ ‘‘రాజ్యసభకు పోటీ చేయాలనుకునే అభ్యర్ధికి  మద్దతుగా 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేస్తే చాలు. ఆయన బరిలో ఉన్నట్లే. ప్రతిపాదించిన ఎమ్మెల్యేలు తరువాత మనసు మార్చుకుని మద్దతు ఉపసంహరించుకున్నామని లేఖలు రాసినా అవి చెల్లుబాటు కావు. ’’అని వివరణ ఇచ్చారు. 
>
మరిన్ని వార్తలు