రెబల్ రాజకీయం

16 Mar, 2014 02:48 IST|Sakshi
రెబల్ రాజకీయం

 ‘మేమేం.. తక్కువతిన్నాం.. ? గెలిచే సత్తా ఉంది. బలం నిరూపించుకున్నాకే.. మమ్మల్ని గుర్తించి పార్టీలోకి పిలవండి..’ అంటూ ప్రధాన పార్టీల మున్సిపల్ అభ్యర్థులు కొందరు  సవాళ్లు విసురుతున్నారు. పార్టీ గుర్తింపునకు నోచుకోని వారు..ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయాలని నిర్ణయించారు.

ఆమేరకు ఎవరికి వారు మున్సిపల్ పోరు బరిలో నిలిచేందుకు నామినేషన్లు దాఖలు చేశారు. రెబల్ అభ్యర్థులతో పార్టీలకు నష్టం వాటిల్లుతోందని.. అన్ని పార్టీల నేతలు తలలు పట్టుకు కూర్చొన్నారు. మున్సిపల్ అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన సైతం శనివారంతో పూర్తయింది. ఎన్నికలు జరిగే రెండు మున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీల్లో కలిపి 145 వార్డులుండగా, మొత్తం 1218 నామినేషన్లు దాఖలయ్యాయి.

అంటే, సగటున ఒక్కోవార్డుకు తొమ్మిదికి మించి నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలైన వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, కాంగ్రెస్‌తో పాటు వామపక్షాలు, బీఎస్పీ, లోక్‌సత్తా తరఫునే కాకుండా.. ఎవరికి వారు స్వంతంత్రంగా కూడా నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. ఇక నుంచి ఉపసంహరణల పర్వం మొదలవనుంది. ఈనెల 18వ తేదీ మధ్యాహ్నం వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియకు గడువుండగా.. ఇప్పట్నుంచే ప్రధాన పార్టీల నేతలు తమ పార్టీలపై ‘రెబల్స్’ బెడద లేకుండా చేసుకునేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. వార్డులవారీగా నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులను వేర్వేరుగా పిలిపించుకుని వారితో మంతనాలాడుతున్నారు.

 డామిట్ .. కథ అడ్డం తిరిగింది..!
 

మున్సిపల్ ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఎత్తులకు పైఎత్తులేయాలనే వ్యూహంతో టీడీపీ, కాంగ్రెస్‌లు పన్నిన ప్రణాళిక బెడిసికొడుతోంది. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పేరును బయటకు వెల్లడించకుండానే.. రాజకీయ పార్టీలు ఒక్కోవార్డుకు ఒక్కోపార్టీ తరఫున నలుగైదుగురు అభ్యర్థులను రంగంలోకి దించాయి. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను బట్టి తమవారిని ‘బరి’లో ఉంచాలా..? వద్దా..? అనే నిర్ణయం తీసుకుందామని భావించాయి. అయితే, ప్రస్తుతం ఆ రెండు పార్టీల తరఫున నామినేషన్లు దాఖలు చేసిన వారంతా.. తాము ఉపసంహరణకు అంగీకరించే ప్రసక్తే లేదంటూ ఖరాఖండిగా చెబుతున్నారు.

పార్టీ తరఫున బీఫాం ఇవ్వకపోయినా.. తాము స్వతంత్రంగా పోటీచేసి గెలిచినప్పుడే గుర్తించాలంటూ సవాళ్లు విసురుతున్నారు. ఇటువంటి పరిస్థితి కనిగిరి, చీమకుర్తి, అద్దంకి, మార్కాపురం మున్సిపాలిటీల్లో అధికంగా ఉంది. ఆయాచోట్ల టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఎవరికి వారు తమ అనుచరులను రెచ్చగొట్టి నామినేషన్లు వేయించడంతో.. కొందరు అభ్యర్థులు కొరకరాని కొయ్యగా మారుతున్నారు. ప్రధానంగా అద్దంకిలో స్థానిక టీడీపీ నేత కరణం బలరాంకు పార్టీలో ఉన్న వ్యతిరేకవర్గంలో కొందరు రెబల్‌గా బరిలో దిగి ఝలక్‌నిస్తున్నారు. కనిగిరిలో కూడా స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి అసంతృప్తుల బుజ్జగింపులు తలనొప్పిగా తయారయ్యాయి. గిద్దలూరులో బీఎస్పీ తరఫున నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు నిన్నటిదాకా స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబు నాయకత్వాన కాంగ్రెస్‌లో పనిచేసిన వారే..

అయితే, ప్రస్తుతం బీఎస్పీ తరఫున వారంతా బరిలోకి దిగేందుకు సిద్ధమైనా... అక్కడ ఇప్పటికే బీఎస్పీ నేతలుగా ఉన్న వారితో సఖ్యతలేకపోవడం గమనార్హం. తమపార్టీ కండువాలను ధరించకుండానే.. సభ్యత్వం లేకుండానే బీఫాంలు ఎలా తెచ్చుకుంటారని స్థానిక బీఎస్పీ నేతలు సవాల్ విసురుతున్నారు. ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా ఈ వ్యవహారంపై ఇరువర్గాలతో పంచాయితీ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. చీరాలలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తన అనుచరవర్గాన్ని స్వతంత్రంగా బరిలో దింపినా.. కాంగ్రెస్ పెద్దల మంతనాలతో కొన్ని వార్డుల్లో అభ్యర్థులను వెనుకంజ వేయిస్తారనే ప్రచారం జరుగుతోంది.

 పనిలోపనిగా ‘డమ్మీల’ డిమాండ్..

 సాధారణంగా ఎన్నికల నామినేషన్ పత్రాల దాఖలప్పుడు ఒక్కో అభ్యర్థి ఒకటి నుంచి రెండు డమ్మీ నామినేషన్‌లను కూడా వేయిస్తాడు. నామినేషన్ దరఖాస్తుల పరిశీలనలో అసలు అభ్యర్థికేమైనా.. నెగిటివ్ మార్కులొస్తే, డమ్మీ అభ్యర్థినే పార్టీ తరఫున నిలబెట్టే ఆస్కారం ఉంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకునే ప్రధాన పార్టీలు.. ఎప్పటిలాగానే ఈసారీ మున్సిపల్ నామినేషన్లలో ‘డమ్మీ’లను దించాయి. రోజురోజుకూ మారుతోన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో డమ్మీల ప్రాధాన్యత కూడా పెరగడంతో..

వారు తమ నామినేషన్లు ఉపసంహ రించుకునేందుకు పార్టీ అభ్యర్థుల నుంచి డబ్బు ఆశిస్తూ డిమాండ్ చేస్తున్నారు. పనిలోపనిగా వారినీ ఏదోరకంగా సంతృప్తి పరిచేందుకు అన్నిపార్టీల నేతలు కసరత్తుచేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు