సభా సంప్రదాయాలను కాలరాస్తారా?

17 Dec, 2013 01:46 IST|Sakshi

= ప్రతిపక్ష పాత్ర ఏమైంది
 = ముఖ్యమంత్రి కిరణ్ ఎక్కడ?
 = వైఎస్సార్ సీపీ నేత సామినేని ఉదయభాను  

 
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : శాసన సభా సంప్రదాయాలను అధికార కాంగ్రెస్ పార్టీ కాలరాస్తుంటే దానికి టీడీపీ నాయకులు సహకరిస్తున్నారని ఇది అసెంబ్లీ చరిత్రలోనే దుర్దినమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీలో తెలంగాణా ముసాయిదా బిల్లుపై బీఏసీ (శాసనసభ వ్యవహారాల కమిటీ)లో చర్చించకుండానే, సభలో చర్చకు అనుమతించడం ప్రజాప్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. ఏదైనా ఒక అంశం పై చర్చించేముందు ఆ అంశంపై బీఏసీ లో  ఎంత సేపు చర్చించాలి, ఎవ రెవరికి మాట్లాడే అవకాశమివ్వాలి, వంటి అంశాలపై నిర్ణయం తీసకుకోవాల్సి ఉంటుందన్నారు.

కానీ, తెలంగాణా ముసాయిదా బిల్లుపై చర్చించేందుకు అలాంటివేమీ లేకుండా ఎంతో పవిత్రమైన సభా సంప్రదాయాలను కాలరాశారన్నారు. దానికి తెలుగుదేశం పూర్తిగా తెరవెనుక సహకారం అందించిందన్నారు. నిన్నమొన్నటి వరకు విభజన తీర్మానాన్ని అడ్డుకుంటామని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ఎక్కడకు పోయారని ఆయన ప్రశ్నించారు. బిల్లు చర్చ సందర్భంగా ఉప సభాపతి ప్రతిపక్ష నేత చంద్రబాబు అభిప్రాయాన్ని చెప్పాలంటూ పదేపదే కోరినా చంద్రబాబు ఎందుకు నోరు మెదపలేదన్నారు.

ముందు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ తీర్మానం చేద్దామని పదేపదే చెప్పిన విషయాన్ని ఆయన   గుర్తు చేశారు. నిజంగా  చిత్తశుద్ధి  ఉంటే తెలుగు జాతిని మోసం చేయకూడదనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా తీర్మానం చేసేందుకు సహకరించేవారన్నారు. సభలో సభాపతి మనోహర్ కాకుండా తెలంగాణాకు చెందిన ఉప సభాపతి స్థానంలో ఉన్న బట్టి విక్రమార్క చేతనే బిల్లుపై చర్చకు అనుమతించేలా చేయడం వంటి అంశాలు రాజకీయ ఎత్తుగడేనని తెలిపారు. బీఏసీలో చర్చలేకుండా తీర్మానంపై చర్చకు అనుమతించడం చూస్తే హైకమాండ్  డెరైక్షన్‌లోనే ఇది జరిగిందన్నారు. దీని కి ద్విగ్విజయ్ సింగ్,  కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులతో రిహార్సల్స్ చేయించారన్నారు.
 
జాతి ద్రోహులను తరిమికొట్టండి....

తెలుగు జాతికి ద్రోహం చేస్తున్న వారిని తరిమికొట్టాలని ఉదయ భాను పిలుపు నిచ్చారు. అధికారం కోసం పదవుల కోసం నీచ రాజకీయాలకు పాల్పడేవారిని రాష్ట్రంలో తిరగనీయొద్దంటూ రాష్ట్ర ప్రజలకు విజ్ణప్తి చేశారు. రాష్ట్ర సమైక్యతకోసం నిరంతర కృషి చేస్తున్నది ఒక్క జగన్‌మోహనర్ రెడ్డి మాత్రమే అన్న సంగతి అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ఆర్టికల్-3పై సవరణ తీసకుకురావాలని జగన్‌మోహనరెడ్డి జాతీయ స్థాయిలో మద్దతు కూడగడుతుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి దడపుడుతుందన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఒక శక్తి అన్న విషయం త్వరలోనే నిరూపితమవుతుందన్నారు.
 

>
మరిన్ని వార్తలు