కాలేజీల్లో ‘ఆన్‌లైన్‌ జియో బయోమెట్రిక్‌’ 

9 Feb, 2020 03:45 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సిఫార్సు 

విద్యార్థుల హాజరు శాతాన్ని గణనీయంగా పెంచడమే లక్ష్యం  

హాజరు నమోదులో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయం  

విద్యార్థులు తరగతులకు రాకున్నా వచ్చినట్లు చూపిస్తున్న ప్రైవేట్‌ కాలేజీలు  

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సొమ్ము కోసం హాజరులో గోల్‌మాల్‌  

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో ‘ఆన్‌లైన్‌ జియో బయోమెట్రిక్‌’ విధానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ అభిప్రాయపడుతోంది. విద్యార్థుల హాజరు శాతాన్ని గణనీయంగా పెంచాలంటే  ఈ విధానమే మేలని చెబుతోంది. ఇటీవల రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్‌ కాలేజీల్లో కమిషన్‌ తనిఖీలు నిర్వహిచింది. కాలేజీల్లో విద్యార్థుల హాజరు అంతంతమాత్రంగానే ఉన్నట్లు గుర్తించింది. పలు ప్రైవేట్‌ కాలేజీల్లో రిజిస్టర్లలోని విద్యార్థుల సంఖ్యకు, హాజరైనట్లు నమోదు చేసిన సంఖ్యకు, వాస్తవంగా అక్కడున్న వారి సంఖ్యకు మధ్య పొంతన లేకపోవడాన్ని కమిషన్‌ పసిగట్టింది.

పలు కాలేజీలు విద్యార్థులు పూర్తిస్థాయిలో హాజరైనట్లు రికార్డుల్లో నమోదు చేస్తూ, యూనివర్సిటీలకు సమర్పిస్తున్నాయి. ఆయా విద్యార్థుల పేరిట ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సొమ్ము కోసం హాజరులో గోల్‌మాల్‌  చేస్తున్నాయి. మరోవైపు తరగతులకు హాజరు కాకున్నా హాజరైనట్లు అటెండెన్స్‌ వేయడానికి విద్యార్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు కమిషన్‌ దృష్టికి వచ్చింది. ఇలాంటి అక్రమాలను అరికట్టేందుకు ఆన్‌లైన్‌ జియో బయోమెట్రిక్‌ విధానంపై కమిషన్‌ దృష్టిపెట్టింది. దీనిపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.  

హాజరులో మాన్యువల్‌గా అక్రమాలు 
ప్రస్తుతం పలు ప్రైవేట్‌ కాలేజీల్లో విద్యార్థుల హాజరును మాన్యువల్‌గా తీసుకొని రిజిస్టర్లలో నమోదు చేస్తున్నారు. ఇందులో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పొందాలంటే నిర్దేశిత హాజరు తప్పనిసరిగా ఉండాలి. అందుకే విద్యార్థుల హాజరుపై కాలేజీలు తప్పుడు నివేదికలు సమర్పిస్తూ ప్రభుత్వం ఫీజులు రాబట్టుకుంటున్నాయి. అందుకే మాన్యువల్‌ విధానానికి బదులు జియో బయోమెట్రిక్‌ విధానాన్ని అన్ని కాలేజీల్లో కచ్చితంగా అమలు చేయాలని కమిషన్‌ వెల్లడించింది.  

విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సూచనలు  
- ప్రతి విద్యార్థికి సెమిస్టర్‌ లేదా ఆ ఏడాది మొత్తంలో 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలి.  
- విద్యార్థి సంబంధిత సంవత్సరపు సబ్జెక్టుల్లో 50 శాతం వరకైనా ఉత్తీర్ణుడై ఉండాలి. అప్పుడే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హుడవుతాడు.  
విద్యార్థుల వాస్తవ హాజరును నమోదు చేసేందుకు జియో బయోమెట్రిక్‌ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలి.  
- జియో బయోమెట్రిక్‌ను 2020–21 నుంచి అమలు చేయాలి. దాన్ని ఆన్‌లైన్‌ విధానంలో పర్యవేక్షించాలి.  
- కాలేజీలోని విద్యార్థుల హాజరు నమోదు సర్వర్‌ డేటా బేస్‌ను సంబంధిత యూనివర్సిటీకి, సాంఘిక సంక్షేమ శాఖకు, జ్ఞానభూమి పోర్టల్‌తో అనుసంధానించాలి.  
- జియో బయోమెట్రిక్‌ పరికరాలు పని చేయకుంటే ఆ రోజు కాలేజీ ప్రిన్సిపల్‌ విద్యార్థుల అటెండెన్స్‌ను రికార్డు చేసి, రిజిస్టర్‌ స్కాన్డ్‌ కాపీలను సంబంధిత వర్సిటీకి, ప్రభుత్వ విభాగానికి ఈ–మెయిల్‌ ద్వారా పంపించాలి.  
- జియో బయోమెట్రిక్‌ హాజరును అమలు చేయని కాలేజీలపై చర్యలు తీసుకోవాలి.   

మరిన్ని వార్తలు