రికార్డు స్థాయిలో వర్షం

13 Aug, 2013 06:08 IST|Sakshi

అనకాపల్లి, న్యూస్‌లైన్: ఖరీఫ్‌పై ఆశలు వదులుకున్న రైతులకు ఆగస్టు నెల ఊపిరి పోసింది. 12 రోజుల వ్యవధిలోనే 98.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో రైతుల్లో ఆశలు చిగురించినట్టయింది. మోడుబారుతున్న పంటలకు జడివాన జీవం పోసింది. ఈ నెల 6న 25 మి.మీ వర్షపాతం నమోదు కాగా సోమవారం తెల్లవారుజామున కురిసిన వర్షం ఈ ఏడాదికే రికార్డుగా నమోదయింది.

ఏజెన్సీలో ఇప్పటికే భారీ వర్షాలు నమోదయినప్పటికీ మైదాన ప్రాంతంలో బహుశా ఇదే మంచి వర్షం కావచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సుమారు 52.6 మి.మీ.వర్షపాతం నమోదు కావడంతో పంటపొలాల్లోను, సాగునీటి కాలువల్లోను నీరు నిలిచింది. గత వారంరోజులుగా అడపాదడపా వర్షం కురవడంతో కమతాలలో చురుగ్గా కదులుతున్న రైతులకు ఆదివారం నాటి వర్షం రెట్టించిన ఉత్సాహాన్నిచ్చింది. జూలైలో కేవలం 10 రోజులలో మాత్రమే వర్షం కురిసింది. మొత్తం మీద 29.6 మి.మీ వర్షపాతం నమోదైంది.
 
ఆగస్టులో ఇప్పటికే రమారమి 100 మి.మీ. వర్షం పడడంతో ఖరీఫ్‌ను ఉత్సాహంగా కొనసాగించడానికి వీలవుతోంది. ఖరీఫ్ విస్తీర్ణం పెరిగేందుకు ఈ వర్షాలు దోహదపడడంతో పాటు పంటలను ఆశించిన పురుగులు కొట్టుకుపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వరి రైతులు నారుపెంపకంతో సంబంధం లేకుండా నేరుగా విత్తే పద్ధతిలో సాగు చేయాలని ఇప్పటికే అటు శాస్త్రవేత్తలు, ఇటు వ్యవసాయాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షాధార చెరకుకు కూడా మేలు చేసే స్థాయిలో వర్షం కురిసింది. రానున్న రోజుల్లో వర్ష సూచన ఉందని వాతావరణ విభాగ శాస్త్రవేత్త ఎం.బి.జి.ఎస్. కుమారి ‘న్యూస్‌లైన్’ కు తెలిపారు.
 

మరిన్ని వార్తలు