సూర్యుడు @ 48

31 May, 2018 03:11 IST|Sakshi

     నేడు కృష్ణా జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

     48 డిగ్రీలను చేరుకునే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరిక 

     ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణశాఖ సూచన

     గతేడాదితో పోలిస్తే ఈసారి మెరుగైన వర్షాలే అంటున్న వాతావరణ శాఖ

సాక్షి, అమరావతి: రోళ్లు పగిలే రోహిణి కార్తెలో భానుడి భగభగలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. బయట కాలు పెడితే సూరీడి వేడి సెగలతో జనం అల్లాడుతున్నారు. ఇళ్లల్లో ఉన్నవారు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే వేడి గాలులు మొదలై రాత్రి 9 గంటల వరకు తీవ్రత కొనసాగుతుండటంతో పిల్లలు, వృద్ధులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఎండ ధాటికి శీతల యంత్రాలు కూడా మొరాయిస్తున్నాయి. మరోవైపు ఎన్నడూ లేనంతగా నేడు కృష్ణా జిల్లాలో కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు అత్యంత తీవ్ర స్థాయికి చేరుకునే ప్రమాదం ఉన్నట్లు వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేయటం ఆందోళన కలిగిస్తోంది.  

ఈ సీజన్‌లో అత్యధికం
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళిక సంస్థ (ఏపీఎస్‌డీపీఎస్‌)కు చెందిన ఆటోమేటిక్‌ వాతావరణ కేంద్రాల్లో బుధవారం పలుచోట్ల 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలోని సీతానగరం, కాకినాడ (అర్బన్‌), నెల్లిపాక, కూనవరం, తాళ్లపూడి, ప్రకాశం జిల్లాలోని ఇంకొల్లు, మర్రిపూడి, కొండపిలో 44.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. కృష్ణా జిల్లాలోని విజయవాడ రూరల్‌లో 44.4, గుంటూరు జిల్లా నరసరావుపేటలో 44.3, పశ్చిమ గోదావరి జిల్లా కుకునూరులో 44.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో ఇవే అత్యధిక ఉష్ణోగ్రతలు కావడం గమనార్హం. 

నేడు కృష్ణాలో భగభగలు
రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వడగాడ్పులు నేడు మరింత తీవ్రంగా ఉంటాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ‘గురువారం కృష్ణా జిల్లాలో కొన్ని చోట్ల ఉష్ణోగ్రత 48 డిగ్రీల సెల్సియస్‌ను తాకే అవకాశం ఉంది. గుంటూరు, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44 – 46 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు. ఉభయ గోదావరి, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41 – 43 డిగ్రీల సెల్సియస్‌ దాకా ఉష్ణోగ్రతలు రికార్డయ్యే అవకాశం ఉందంటూ ఐఎండీ హెచ్చరించింది. ప్రజలు వడగాడ్పుల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి’ అని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. 

ఇవీ జాగ్రత్తలు..
– ఎండాకాలంలో శరీరం నుంచి చమట రూపంలో లవణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నందున 
ద్రవ పదార్థాలు, నీరు అధికంగా తీసుకోవాలి.
– ఎండ వేళ బయట తిరగకుండా జాగ్రత్త వహించాలి.
– వదులుగా ఉండే కాటన్‌ దుస్తులు ధరించాలి.
– చల్లదనం కోసం కిటికీలకు పరదాలు అమర్చాలి
– 3 నుంచి పలు దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు

విశాఖ సిటీ: నైరుతి రుతుపవనాలు కేరళను తాకిన నేపథ్యంలో ఈ ఏడాది వర్షపాత అంచనా వివరాలను భారత వాతావరణ విభాగం(ఐఎండీ) బుధవారం వెల్లడించింది. ఈసారి దాదాపుగా దేశమంతా ఒకే విధంగా సాధారణ వర్షపాతం ఉంటుందని తెలిపింది. 2017 కంటే ఈ ఏడాది కాస్త మెరుగైన వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయని వెల్లడించింది. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకూ దేశంలో 97 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ఐఎండీ వివరించింది. 

విస్తరిస్తున్న రుతుపవనాలు
నైరుతి రుతుపవనాల ప్రభావంతో కర్ణాటకలో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా జూన్‌ 3వతేదీ నుంచి ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోనూ వానలు విస్తారంగా పడతాయని ఐఎండీ పేర్కొంది. బుధవారం నాటికి రుతుపవనాలు అరేబియా సముద్రంతోపాటు కేరళలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటక తీరంలో కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని కొన్ని భాగాలకు విస్తరించాయి. ఆదివారం నాటికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురిసేందుకు అనువైన సమయంగా కనిపిస్తోందని ఐఎండీ తెలిపింది. 

మరిన్ని వార్తలు