తుంగభద్ర జలాల వినియోగంలో రికార్డు

28 May, 2020 05:32 IST|Sakshi

హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, కేసీ కెనాల్‌ కింద 78.169 టీఎంసీల వినియోగం

సాక్షి, అమరావతి: తుంగభద్ర జలాల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఈ నీటి సంవత్సరంలో గరిష్ట స్థాయిలో 54.363 టీఎంసీలను తుంగభద్ర జలాశయం ద్వారా.. సుంకేశుల బ్యారేజీ నుంచి కేసీ కెనాల్‌ ద్వారా 23.806 టీఎంసీలు.. మొత్తం 78.169 టీఎంసీలు వినియోగించుకుంది. రాజోలిబండ డైవర్షన్‌ స్కీం (ఆర్డీఎస్‌) కింద తెలంగాణ సర్కార్‌ 5.93 టీఎంసీలు వాడుకుంది. దాంతో హెచ్చెల్సీ (ఎగువ కాలువ), ఎల్లెల్సీ (దిగువ కాలువ), కర్నూల్‌–కడప (కేసీ) కెనాల్‌ కింద ఖరీఫ్, రబీల్లో 5,27,013 ఎకరాలకు సర్కార్‌ నీళ్లందించగలిగింది. కర్ణాటక పరిధిలో హెచ్చెల్సీ ఆధునికీకరణ.. జలచౌర్యానికి అడ్డుకట్ట వేయడంవల్లే ఈ ఏడాది తుంగభద్ర జలాశయం నుంచి గరిష్ట స్థాయిలో నీటిని రాబట్టగలిగామని అధికార వర్గాలు చెబుతున్నాయి.

పూడికతో తగ్గిన డ్యామ్‌ సామర్థ్యం
► 1953లో తుంగభద్ర డ్యామ్‌ నీటి నిల్వ సామర్థ్యం 132.47 టీఎంసీలు. పూడిక పేరుకుపోవడంతో జలాశయంలో నీటినిల్వ సామర్థ్యం 100.855 టీఎంసీలకు తగ్గింది. దీంతో ఇది నీటి లభ్యతపై ప్రభావం చూపుతుండటం వల్ల దామాషా పద్ధతిలో తుంగభద్ర బోర్డు నీటిని కేటాయిస్తోంది.
► తుంగభద్ర డ్యామ్‌లో ఏడాదికి 230 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్‌ ట్రిబ్యునల్‌ కర్ణాటకకు 151.49, ఉమ్మడి రాష్ట్రానికి 78.51 టీఎంసీలు (ఆర్డీఎస్‌ వాటాగా తెలంగాణకు 6.51 టీఎంసీలు) కేటాయించింది. ఇక ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 72 టీఎంసీల్లో.. హెచ్చెల్సీకి 32.50, ఎల్లెల్సీకి 29.5 కేసీ కెనాల్‌కు పది టీఎంసీల వాటా ఉంది.

తుంగభద్ర బోర్డు చరిత్రలో ఇదే రికార్డు..
​​​​​​​► ఈ నీటి సంవత్సరంలో తుంగభద్ర డ్యామ్‌కు ఎన్నడూ లేని రీతిలో 415.77 టీఎంసీల ప్రవాహం వచ్చింది. డ్యామ్‌లో 173.673 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన బోర్డు హెచ్చెల్సీకి 27.39, ఎల్లెల్సీకి 20.215, కేసీ కెనాల్‌కు ఉన్న వాటాలో 6.758 టీఎంసీలు (ఇందులో 2.802 టీఎంసీలను హెచ్చెల్సీకి మళ్లించారు) విడుదల చేశారు. అంటే తుంగభద్ర డ్యామ్‌ నుంచి ఈ ఏడాది రాష్ట్రం 54.363 టీఎంసీలు వినియోగించుకుంది. బోర్డు చరిత్రలో ఇంత నీటిని రాష్ట్రం వినియోగించుకోవడం ఇదే తొలిసారి.
​​​​​​​► హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, కేసీ కెనాల్‌ కింద రాయలసీమలో 5.27 లక్షల ఎకరాలకు నీళ్లందించడం ద్వారా ఈ ఏడాది సరికొత్త రికార్డును సర్కార్‌ నెలకొల్పింది.

కర్ణాటక జలచౌర్యానికి అడ్డుకట్ట
కర్ణాటక పరిధిలో హెచ్చెల్సీ, ఎల్లెల్సీల నుంచి రైతులు భారీఎత్తున జలచౌర్యం చేసేవారు. దాంతో తుంగభద్ర జలాలు రాయలసీమకు సక్రమంగా చేరేవి కాదు. కానీ, ఈ ఏడాది తుంగభద్ర బోర్డుపై సర్కార్‌ తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చింది. హెచ్చెల్సీ, ఎల్లెల్సీ కాలువలపై సీఆర్‌పీఎఫ్‌ విభాగంతో గస్తీ నిర్వహించడం ద్వారా జలచౌర్యానికి అడ్డుకట్ట వేయగలిగింది. అలాగే, హెచ్చెల్సీ, ఎల్లెల్సీల పనులు పూర్తిచేయడంవల్ల కూడా సరఫరా నష్టాలు తగ్గాయి. దీనివల్లే ఈ ఏడాది అధిక ఆయకట్టుకు సర్కార్‌ నీళ్లందించడంతో దిగుబడులు బాగా వచ్చాయి. దీంతో వరి, వేరుశనగ, మిర్చి, ఉల్లి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు