రిక‘రింగ్’

13 Mar, 2015 02:53 IST|Sakshi

కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఏజెంట్లతో సంబంధం లేకుండా చిన్న మొత్తాలను నేరుగా పోస్టాఫీసులకు వచ్చి జమ చేసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే పోస్టల్ అధికారులు కొందరు ఇవేమీ పట్టించుకోవడం లేదు. కాసులకు కక్కుర్తి పడి ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రభుత్వానికి చెందాల్సిన ఆదాయాన్ని కమీషన్ రూపంలో స్వాహా చేస్తున్నారు. చిన్నమొత్తాల పొదుపును 2012 వరకు రెవెన్యూ శాఖ పర్యవేక్షించేది. చిన్న మొత్తాలను సేకరించేందుకు కలెక్టర్ ఏజెంట్లను నియమించేవారు.
 
 అయితే ఏజెంట్ల ప్రమేయం లేకుండా ప్రజలే నేరుగా పోస్టాఫీసులకు వెళ్లి రికరింగ్ డిపాజిట్లు (ఆర్‌డీలు), టైమ్ డిపాజిట్లు (టీడీలు) చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో కలెక్టరేట్‌లో ఉన్న చిన్నమొత్తాల పొదుపు సంస్థ కార్యాలయాన్ని తీసివేసింది. కొత్త ఏజెంట్ల నియామకాలను పూర్తిగా నిలిపివేసింది. అయితే పోస్టుమాస్టర్లు మాత్రం బినామీ ఏజెంట్లతో  కమీషన్ నొక్కేస్తుండటం గమనార్హం. కొంతకాలంగా అనేక మంది పొదుపు చేయడంలో భాగంగా ఆర్డీలు, టైం డిపాజిట్లు చేసేందుకు నేరుగా పోస్టాఫీసులకు వస్తున్నారు.
 
 దీన్ని అవకాశంగా తీసుకుని వాటిని బినామీ ఏజెంట్ల నంబర్ కోడ్‌చేసి కమీషన్ దండుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. పోస్టుమాస్టర్లకు రూ. 30 నుంచి రూ. 50 వేల వరకు జీతాలు వస్తున్నా టైమ్ డిపాజిట్లు, ఆర్డీలను బీనామీ ఏజెంట్లకు వేసి వేలాది రూపాయలు కమీషన్లతో జేబులు నింపుకుంటున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కర్నూలు నగరంలో బజార్ పోస్టాఫీస్, బి.క్యాంప్, కొత్తపేట పోస్టాఫీసులతో పాటు నందికొట్కూరు, బేతంచెర్ల, ఎమ్మిగనూరు పోస్టాఫీసుల్లో ఎక్కువగా ఉంది. ఈ విషయం పోస్టల్ ఉన్నతాధికారులకు తెలిసినా వారికి మామూళ్లు అందుతుండటంతో చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. రికరింగ్ డిపాజిట్లపై 4 శాతం, టైమ్ డిపాజిట్లపై 50 పైసల ప్రకారం కమీషన్ ఉంది. దాన్ని పోస్టుమాస్టర్లు బినామీ ఏజెంట్ల పేరుతో స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
 
 మచ్చునకు కొన్ని ఉదాహరణలు..
 కర్నూలుకు చెందిన సహెరాబేగం 2014 ఆగస్టు 25న బజారు బ్రాంచ్‌లో రూ. 8 లక్షల టైమ్ డిపాజిట్ చేశారు. దీనిని బినామీ ఏజెంటుకు వేసి కమీషన్ తీసుకున్నారు. కర్నూలుకు చెందిన సావిత్రి, రోసిరాజు గత ఏడాది సెప్టెంబరు 4న రూ. 1.50 లక్షల ప్రకారం టైమ్ డిపాజిట్లు చేశారు. వీటిని కూడా వారికి తెలియకుండా బినామీ ఏజెంట్లకు వేసి కమీషన్ తీసుకున్నారు. సువర్ణ అనే పేరున కమీషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇటువంటి ఉదంతాలు కోకొల్లలు.
 
 సమస్యను మా దృష్టికి  తేవచ్చు.. :  కె.వి.సుబ్బారావు, పోస్టల్ సూపరింటెండెంట్
 వినియోగదారులకు వివరించి వారిని పోస్టాఫీసుల దాకా వచ్చేలా ఏజెంట్లు ప్రోత్సహిస్తున్నారు. దీంతో పోస్టుమాస్టర్లు వారికి కమీషన్లు ఇప్పిస్తున్నారు. ఎవరైనా ఇబ్బందిపెట్టే విధంగా వ్యవహరిస్తే  మా దృష్టికి తేవచ్చు.
 

మరిన్ని వార్తలు