చోరీ సొమ్ము రికవర్రీ

29 Oct, 2018 11:55 IST|Sakshi

దొంగలను పట్టుకున్న ప్రతిసారీ ఇదే తంతు

కక్షకట్టి వసూలు చేస్తున్నారని పోలీసులపై ఆరోపణలు  

తర్వాత చర్చలతో సద్దుమణుగుతున్న వివాదాలు  

అనంతపురం సెంట్రల్‌: అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను అనంతపురం పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు, వైఎస్సార్‌ కడప, అనంతపురం జిల్లాలకు చెందిన పలువురు దొంగలను విచారణ చేస్తున్నారు. నిందితుల నుంచి సొమ్ము రికవరీ చేయడంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాము ఏ తప్పూ చేయకున్నా పోలీసులు వేధిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. గత రెండురోజులుగా త్రీటౌన్‌ పోలీసుస్టేషన్‌ వద్ద పెద్ద వివాదమే నడుస్తోంది.  

జిల్లాలో దొంగ– పోలీసు ఆట ప్రతిసారీ వివాదాస్పదమవుతోంది. దొంగలను పట్టుకోవడం ఒక ఎత్తు అయితే.. వారి నుంచి రికవరీ చేయడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది. సొమ్ములు ఎక్కడ విక్రయించారన్నది దొంగలు చెబుతున్నప్పటికీ రికవరీ మాత్రం కావడం లేదు. తమకు ఎలాంటి సబంధం లేకున్నా పోలీసులు కక్షకట్టి వసూలు చేస్తున్నారని సదరు వ్యక్తులు వాపోతున్నారు. పోలీసులు చెప్పినంత ఇవ్వకపోతే తమపై అక్రమకేసులు బనాయిస్తామని బెదిరింపులకు దిగుతున్నట్లు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఇదే విషయంపై నగరంలోని బంగారుషాపు నిర్వాహకులంతా ఏకమై పాతూరు నుంచి డీఎస్పీ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీఎస్పీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. తొలుత తమ తప్పేమీ లేదంటున్నప్పటికీ తర్వాత కొంతమేర ముట్టుజెబుతుండడం నేరాలను ఒప్పుకున్నట్టు  పరోక్షంగా అర్థమవుతోంది. పోలీసులు కూడా ఇలాంటి వారిపై తమకు రికవరీ రూపంలో నగదు, బంగారు ఇచ్చేస్తే చాలు కేసులేమీ అవసరం లేదు అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు.   

తరచూ వివాదాలే..
అనంతపురంలో దొంగలను పట్టుకొని పోలీసులు రికవరీ చూపిస్తున్న ప్రతి కేసులోనూ అంతకుముందు వివాదాలు జరుగుతున్నాయి. మూడునెలల క్రితం సీసీఎస్‌లో పనిచేసే ఓ ఎస్‌ఐ దొంగను వెంటబెట్టుకొని హైదరాబాద్‌కు వెళ్లినట్లు సమాచారం. అక్కడ ఓ వ్యక్తిని బెదిరించి రికవరీ చేసుకొని వచ్చినట్లు ఆరోపణలు వినిపించాయి. ఈ విషయంపై సదరు వ్యక్తి సైబరాబాద్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల తమిళనాడులో ఏకంగా ధర్మవరం పోలీసులపై దాడి జరిగినట్లు తెలిసింది. ఏడాది కాలంలో రెండు, మూడు దఫాలు పోలీసు వర్సెస్‌ స్వర్ణకారులు అన్న చందంగా ఆందోళనలు జరిగాయి. తాజాగా ప్రస్తుతం సీసీఎస్‌– త్రీటౌన్‌పోలీసులు అదుపులో ఉన్న దొంగల విషయంలో కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెవిలో కమ్మలతో సహా తీసుకొచ్చారని కొంతమంది మహిళలు విలేకరుల ఎదుట వాపోయారు. తమ బంధువులకు ఎలాంటి సంబంధం లేకపోయినా... గతంలో ఒక్క కేసు కూడా లేకపోయినా తీసుకొచ్చారని గగ్గోలు పెడుతున్నారు. పోలీసులు మాత్రం ఇలాంటివి సర్వసాధారణమేనని, తమ వద్ద అన్ని సాక్షాధారాలు ఉంటేనే తీసుకొస్తామని స్పష్టం చేస్తున్నారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా