పది జిల్లాల్లో 50% దాటిన రికవరీ రేటు

14 May, 2020 03:58 IST|Sakshi

95.23 శాతం రికవరీ రేటుతో మొదటి స్థానంలో ప్రకాశం జిల్లా 

కేసులు అత్యధికంగా నమోదైన మూడు జిల్లాల్లో యాక్టివ్‌ కేసుల కంటే డిశ్చార్జిలే అధికం 

బుధవారం కొత్తగా 48 కేసులు నమోదైతే 86 మంది డిశ్చార్జి  

రాష్ట్రంలో 2,137కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మొత్తం 10 జిల్లాల్లో 50 శాతం మందికిపైగా కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సగటు రికవరీ రేటు 32.9 శాతం మాత్రమే ఉంటే అది మన రాష్ట్రంలో 53.44 శాతంగా ఉండటం గమనార్హం. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,137 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా  అందులో 1,142 మంది కోలుకోవడంతో డిశ్చార్జి చేశారు. దీంతో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న కేసుల సంఖ్య 948కి తగ్గిపోయింది. ప్రకాశం జిల్లాలో బుధవారం నాటికి 63 మందికి కరోనా వైరస్‌ సోకితే అందులో 60 మంది కోలుకున్నారు. దీంతో ఆ జిల్లా 95.23 శాతం రికవరీ రేటుతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అత్యధిక కేసులు నమోదైన కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా రికవరీ రేటు 50 శాతం మించి ఉండటం విశేషం. 

ఒకే రోజు 86 మంది డిశ్చార్జి
కరోనా వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకోవడంతో 86 మందిని డిశ్చార్జి చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. ఇందులో గుంటూరు జిల్లా నుంచి 27 మంది, కృష్ణా జిల్లా నుంచి 25, కర్నూలు జిల్లా నుంచి 13, వైఎస్సార్‌ జిల్లా నుంచి 10 మంది, ఉభయగోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున, అనంతపురం, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల నుంచి ఒక్కొక్కరు చొప్పున డిశ్చార్జి అయ్యారు. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 9,284 మందికి పరీక్షలు నిర్వహిస్తే అందులో 48 మందికి కరోనా వైరస్‌ సోకింది. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 47కు చేరింది.

>
మరిన్ని వార్తలు