మెప్మాలో ధనికులదే పెత్తనం

25 Jul, 2019 10:55 IST|Sakshi
మెప్మా కార్యాలయంలో శిక్షణలో పాల్గొన్న ఆర్‌పీలు (ఫైల్‌)

ఆర్పీలుగా పెత్తనం

చలాయిస్తున్న ఉద్యోగుల భార్యలు

ఆశావర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు సైతం ఆర్‌పీలుగా విధులు

పేదలకు మొండిచేయి చూపిస్తున్న వైనం

సాక్షి, గిద్దలూరు (ప్రకాశం): మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్‌లు, నగర పంచాయతీల్లో పేదలను గుర్తించి వారికి తగిన శిక్షణ ఇచ్చి తక్కువ వడ్డీలకు రుణాలు ఇప్పించి పేదలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన మెప్మాలో ఉద్యోగుల భార్యలు, ధనికులు పెత్తనం చెలాయిస్తున్నారు. గిద్దలూరులోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)లో సగానికిపైగా ఆర్‌పీలు ఉద్యోగుల భార్యలు, ఇతర ఉద్యోగాలు నిర్వహిస్తున్న వారే కొనసాగుతున్నారు. దీంతో పట్టణంలోని పేదలకు తీరని అన్యాయం జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. మెప్మా అధికారులు పేదరికంలో ఉన్న ఆర్‌పీలను తొలగించి ధనికుల వద్ద నగదు తీసుకుని ఆర్‌పీలుగా నియమిస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి.

గత ఏడు సంవత్సరాలుగా మెప్మాలో అక్రమాలు యథేచ్ఛగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ చూస్తున్న మెప్మా అధికారులు గత ప్రభుత్వ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గి పట్టనట్లు వ్యవహరిస్తూ వారి విధులను విస్మరించారన్న విమర్శలు ఉన్నాయి. నగర పంచాయతీ కమిషనర్‌ పర్యవేక్షించాల్సి ఉన్నా అటువైపు వెళ్లిన దాఖలాలు కనిపించడం లేదు. దీంతో మెప్మాలో టీడీపీకి అనుబంధంగా ఏర్పడిన ఆర్‌పీల ఆగడాలకు అడ్డేలేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి. మెప్మాలో నాలుగు సంవత్సరాల పాటు ఆర్‌పీగా పనిచేసిన పి.అంజనీదేవిని నిర్దాక్షిణ్యంగా తొలగించి నగదు ఇచ్చిన వారిని ఆర్‌పీగా నియమించుకున్నట్లు సమాచారం.

ఆర్‌పీలుగా ఎవరిని నియమించాలి..?
పట్టణంలో పేద మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు 15 నుంచి 20 స్వయం సహాయక సంఘాలను ఒక స్లమ్‌ లెవల్‌ ఫెడరేషన్‌ (ఎస్‌ఎల్‌ఎఫ్‌)గా ఏర్పాటు చేసి ఒక్కో ఎస్‌ఎల్‌ఎఫ్‌కు ఒక ఆర్‌పీని నియమించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో రిసోర్స్‌ పర్సన్‌లు (ఆర్‌పీలు)గా నియమింపబడాలంటే స్వయం సహాయక సంఘం అధ్యక్షురాలుగా ఉండాలి. స్వయం సహాయక సంఘాలను కేవలం పేదలతోనే ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆమె ఉన్న సంఘంను విజయవంతంగా నిర్వహించి ఆర్థిక లావాదేవీల్లో సంఘం ఉన్నతంగా ఉండేలా చూడాలి. ఆమె సంఘం ఎస్‌ఎల్‌ఎఫ్‌లో చేరి ఉండాలి. పదో తరగతి చదువుకుని మహిళా సంఘాల నిర్వహణ గురించి తెలిసి ఉండాలి. ఆమె సమాఖ్య రికార్డుల నిర్వహణ, బ్యాంకు లావాదేవీలు, సభ్యుల అవసరాలను గుర్తించి వారికి సంఘం ద్వారా చేయూతనిచ్చే విషయాల్లో అవగాహన కలిగి ఉండాలి. కానీ స్థానిక మెప్మా కార్యాలయంలో ధనికులే పెత్తనం చెలాయిస్తున్నారు. పట్టణ సమాఖ్యకు అధ్యక్షులు, కార్యదర్శులు ఉద్యోగుల భార్యలే. టీడీపీకి అనుబంధ సంస్థగా ఏర్పాటై పేదలకు అందాల్సిన సంక్షేమ ఫలాలు వారికి దక్కకుండా చేస్తున్నారన్న అపవాదు ఉంది.

మెప్మాకు అందని ప్రభుత్వ ఫలాలు...
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో సభ్యత్వం తీసుకుని ఎస్‌ఎల్‌ఎఫ్‌లో చేరిన మహిళా సంఘాలన్నీ టౌన్‌ లెవల్‌ ఫెడరేషన్‌ టీఎల్‌ఎఫ్‌గా ఏర్పడతాయి. ఇలా పట్టణంలో 35 ఎస్‌ఎల్‌ఎఫ్‌లు ఉన్నాయి. టీఎల్‌ఎఫ్‌లో చేరిన మహిళలకు, వీధి వ్యాపారులకు, ఇతర చిన్న పరిశ్రమలు నిర్వహించుకునే వారికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు స్త్రీనిధి, రివాల్వింగ్‌ ఫండ్‌ ఇస్తుంది. దీంతో పాటు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు ఇప్పించాల్సి ఉంది. ఇక్కడ తీసుకున్న రుణాలను పెట్టుబడిగా పెట్టి ఆర్థికంగా స్థిరపడేందుకు మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ ఇప్పించి మహిళాసాధికారత దిశగా నడిపించాలి. కేవలం బ్యాంకు రుణాలు ఇప్పించి చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

దీంతో టీఎల్‌ఎఫ్‌లో లావాదేవీలు సక్రమంగా జరగకపోవడం వలన ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయని తెలుస్తోంది. దీంతో పేదలై గ్రూపు సభ్యులకు తీరని అన్యాయం జరుగుతోంది. ఓ ఆర్‌పీ నకిలీ డిగ్రీ సర్టిఫికెట్‌తో కార్యాలయంలో పెత్తనం సాగిస్తూ అధికారులతో కలిసి వడ్డీలేని రుణాలు, స్కాలర్‌షిప్‌ నిధులను పక్కదారి పట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. మరో ఇద్దరు ఆర్‌పీలు మెప్మా ద్వారా రుణాలు ఇప్పిస్తామని మహిళల వద్ద పెద్ద మొత్తంలో నగదు వసూళ్లకు పాల్పడగా, బాధితులు కార్యాలయానికి వస్తున్నారని వారు అటు వైపు వెళ్లడం మానేశారు. అయినప్పటికీ వారిపై చర్యలు తీసుకోలేదు. ఉన్నతాధికారులు మెప్మా కార్యాలయంపై పర్యవేక్షణ లేకపోవడం వలనే ఇవన్నీ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఆర్‌పీలుగా ఉద్యోగుల భార్యలు ఉండకూడదు
ఆర్‌పీలుగా ఉద్యోగులు, ఉద్యోగుల భార్యలు పనిచేయరాదు. ఇప్పటికే అంజనీదేవి అనే మహిళ తాను గతంలో ఆర్‌పీగా పనిచేస్తుండగా తనను తొలగించి ఉద్యోగుల భార్యను నియమించుకున్నారని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నేను గిద్దలూరుకు రాక ముందు జరిగింది. అనర్హులను తొలగిస్తున్నాము. మహిళా సంఘాలకు ప్రస్తుతానికి బ్యాంకు రుణాలు ఇప్పిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రాలేదు. ప్రపోజల్స్‌ పంపిస్తున్నాం. రుణాలు ఇప్పిస్తామని నగదు వసూళ్లకు పాల్పడిన ఇద్దరిని కార్యాలయానికి రావద్దని చెప్పాం. ఆర్‌పీలుగా తొలగించాల్సి ఉంది. త్వరలో అన్నింటినీ సరిచేస్తాం.
– చంద్రశేఖర్, సిటీ మిషన్‌ మేనేజర్, గిద్దలూరు

ఆర్‌పీగా తొలగించారు
నేను నాలుగు సంవత్సరాల పాటు ఆర్‌పీగా పనిచేశాను. ఇటీవల ఆర్‌పీల జాబితాను ప్రభుత్వానికి పంపాలని వచ్చినప్పుడు తన పేరు తొలగించి వేరొకరి పేరు పంపారు. దీంతో తాను ఉద్యోగం కోల్పోయాను. టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారంలో తిరగలేదన్న కక్షతో తనను నిర్దాక్షిణ్యంగా ఆర్‌పీ నుంచి తొలగించారని, ఆర్‌పీలంతా ఉద్యోగుల భార్యలు, ఇతర ఉద్యోగాలు చేసే వారే ఉన్నారు. తనకు ఆర్‌పీగా ఉద్యోగం ఇప్పించాలని స్థానిక అధికారులను కోరినా పట్టించుకోవడం లేదు. నాకు ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలి.
– పి.అంజనీదేవి, రాజానగర్, గిద్దలూరు.

మరిన్ని వార్తలు