ఆర్‌ఈసీఎస్‌కు అవినీతి చెద

4 Jan, 2019 07:38 IST|Sakshi
లంచం తీసుకుంటూ పట్టుబడిన లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ చక్రధరరావు

రూ.7,300 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన లైన్‌ ఇన్‌స్పెక్టర్‌

38 ఏళ్ల ఆర్‌ఈసీఎస్‌ చరిత్రలో ఇదే తొలిసారి

విజయనగరం, చీపురుపల్లి: గ్రామీణ విద్యుత్‌ సహకార సంఘం (ఆర్‌ఈసీఎస్‌)కు అవినీతి చెద పట్టుకుంది. 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో అవినీతి కార్యక్రమాలకు అడ్డాగా మారిన ఆ సంస్థ తాజాగా ఏసీబీ దాడులకు వేదికైంది. ఆర్‌ఈసీఎస్‌ పరిధిలో గల మెరకముడిదాం మండలంలో లైన్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న మారోజి చక్రధరరావు ఒక రైతు నుంచి వ్యవసాయ బోరు కనెక్షన్‌ కోసం రూ.7,300 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. గురువారం సాయంత్రం నియోజకవర్గ కేంద్రమైన చీపురుపల్లిలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఆర్‌ఈసీఎస్‌ పరిధిలో గల మెరకముడిదాం మండలంలోని గరుగుబిల్లి గ్రామానికి చెందిన రైతు రేగాన శంకరరావు 2018 జూలై నెలలో వ్యవసాయ బోరు కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అధికారులెవ్వరూ పట్టించుకోలేదు. పైగా రూ. 7,300 లంచం డిమాండ్‌ చేయడంతో బాధితుడు  ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ ఏఎస్పీ ఎస్‌కే.షకీలాభాను, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు లకో‡్ష్మజీ, సతీష్‌ నేతృత్వంలో సిబ్బంది రంగప్రవేశం చేసి చీపురుపల్లి పట్టణం కొత్త గవిడివీధిలో గల తన ఇంట్లోనే లంచం తీసుకుంటున్న చక్రధర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఇదే మొదటిసారి..
ఆర్‌ఈసీఎస్‌ 1981లో ఏర్పాటైనప్పటి నుంచి ఇంతవరకు ఏసీబీ కేసులు నమోదుకాలేదు. గురువారం జరిగిన సంఘటనే మొట్ట మొదటిది కావడం విశేషం. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే కిమిడి మృణాళిని 2015లో ఆర్‌ఈసీఎస్‌కు నామినేటెడ్‌ కమిటీని నియమించారు. అప్పటి నుంచి ఎన్నో అవినీతి ఆరోపణలు ఆ సంస్థ ఎదుర్కొనాల్సి వచ్చింది. తాజా ఏసీబీ దాడితో చరిత్రలో ఎన్నడూ లేని అవినీతి మచ్చ ఆర్‌ఈసిఎస్‌కు దక్కింది. అయితే గతేడాది ఆర్‌ఈసీఎస్‌లో రూ.1.76 కోట్లు పక్కదోవ పట్టిన విషయంలో సీబీఐ కేసు కూడా నమోదైంది. అలాగే ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగ నియామకాల్లో భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడినట్లు అధికార పార్టీ నాయకులే జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదులు చేసిన సంఘటనలున్నాయి. నాలుగున్నరేళ్లుగా ఆర్‌ఈసీఎస్‌లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ పలుమార్లు ధర్నాలు చేపట్టడంతో పాటు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. 

రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాం....
ఆర్‌ఈసీఎస్‌ పరిధి మెరకముడిదాం మండలంలోని లైన్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న మారోజు చక్రధరరావు..  మెరకముడిదాం మండలం గురుగుబిల్లి గ్రామానికి చెందిన రేగాన శంకరరావు అనే రైతు నుంచి  రూ.7,300 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నాం. 2018 జూలైలో రేగాన శంకరరావు వ్యవసాయ బోరు కోసం దరఖాస్తు చేసుకోగా... లైన్‌ఇన్‌స్పెక్టర్‌ లంచం డిమాండ్‌ చేయడంతో బాధితుడు మమ్మల్ని ఆశ్రయించాడు. దీంతో చక్రధరరావు తన స్వగృహంలో లంచం తీసుకుంటుండగా పట్టుకున్నాం. – ఎస్‌కే షకీలాభాను, ఏఎస్పీ, అవినీతి నిరోధకశాఖ, విజయనగరం

మరిన్ని వార్తలు