తిరుమల, కాణిపాకంలో రెడ్‌ అలర్ట్‌

24 Aug, 2019 03:46 IST|Sakshi
శ్రీకాళహస్తి మార్గంలో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు

కేంద్ర ఇంటెలిజెన్స్‌ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తం

ఆలయాలు, మాల్స్, రైల్వే, బస్‌స్టేషన్ల వద్ద భద్రత పెంపు

తిరుపతి క్రైం: దక్షిణాది రాష్ట్రాల్లో ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉందన్న కేంద్ర ఇంటెలిజెన్స్‌ హెచ్చరికల నేపథ్యంలో ఆధ్యాత్మిక నగరం అప్రమత్తమైంది. శ్రీలంక నుంచి కొందరు తీవ్రవాదులు సముద్ర మార్గాన ఏపీకి చేరే అవకాశం ఉందని సమాచారం రావడంతో చిత్తూరు జిల్లాలోని తిరుపతి, తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తిలో పోలీసులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. తిరుపతి అర్బన్‌ జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్, చిత్తూరు ఎస్పీ వెంకట అప్పల నాయుడు ఆదేశాల మేరకు రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై నిఘా పెంచారు. ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మాల్స్, ఇండస్ట్రీలు, హాస్పిటల్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం, దేవాలయాలు తదితర ప్రాంతాల్లో విçస్తృతంగా తనిఖీలు చేశారు.

అనుమానిత వస్తువులు, వ్యక్తులను గమనిస్తే స్థానిక పోలీసులకు, 100, 8099999977 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రేణిగుంట ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లోకి వచ్చే వ్యక్తుల పాస్‌పోర్టులు తనిఖీ చేయడంతోపాటు భద్రతను పెంచినట్లు తెలిపారు. నగర ప్రవేశ ప్రాంతాల వద్ద వాహనాలను క్షుణ్నంగా పరిశీలిస్తూ, అనుమానిత వ్యక్తులను విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్బన్‌ ఎస్పీ అన్బురాజన్‌ మాట్లాడుతూ.. తిరుమల, తిరుపతితో పాటు తిరుచానూరు, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం, శ్రీవారి మెట్టు ప్రాంతాలు, ఇతర ఆధ్యాత్మిక క్షేత్రాల వద్ద ప్రత్యేక నిఘాను ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

>
మరిన్ని వార్తలు