మేమున్నాం

20 Jun, 2014 03:45 IST|Sakshi
మేమున్నాం
  •      ‘ఎర్ర’ దొంగలకు టీడీపీ ప్రముఖుల భరోసా
  •      మంత్రి బొజ్జలను కలిసిన ‘ఎర్ర’ దొంగలు
  •      బాబును కలిసిన ఇద్దరు స్మగ్లర్ల భార్యలు
  • ‘ఎర్ర’ దొంగలకు టీడీపీ అభయహస్తం అందిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లర్ల జాబితా లో టీడీపీ నేతలు ఉండడంతో ఆ పార్టీ నేతల నుంచి పోలీసులపై ఒత్తిళ్లు ఎక్కువయ్యూయి. తమను రక్షించాలని వీరిలో కొందరు రహస్యంగా మంత్రి బొజ్జలను కలిస్తే.. ఇంకొందరు మహిళలు చంద్రబాబును కలిసి తమ భర్తలను విడిపించాలని వేడుకుని భరోసా పొందినట్లు సమాచారం.

    ఎర్రచందనం అక్రమరవాణాను అడ్డుకునేందుకు నడుంబిగించిన పోలీసులు స్మగ్లర్ల జాబితాను సిద్ధం చేసి వారిని అరెస్టు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ‘సీమ’ పోలీసులంతా ఎక్కడికక్కడ దొరికిన వారిని అరెస్టు చేసేందుకు వ్యూహం పన్నారు. ఇప్పటికే కొందరిని అరెస్టు చేసిన పోలీసులు, మిగిలిన వారిని అరెస్టు చేసేందుకు పక్కా ప్రణాళికతో వెళుతున్నారు. అయితే అరెస్టయిన ఎర్రచందనం స్మగ్లర్లకు ఆ పార్టీ నేతలు తాము ఉన్నామని భరోసా ఇస్తున్నారు.
     
    సాక్షి, చిత్తూరు: అత్యంత అరుదైన, విలువైన ఎర్రచందనం వనాలు చిత్తూరు, వైఎస్సార్‌జిల్లాల పరిధిలో ఉన్నాయి. శేషాచలం, నల్లమల అటవీ ప్రాంతంలో వేలాది హెక్టార్లలో ఎర్రచందనం వనాలు విస్తరించి ఉన్నాయి. కొన్నేళ్లుగా ‘అడవి దొంగలు’ ఎర్రచందనం వృక్షాలను తెగనరికి విదేశాలకు తరలిస్తున్నారు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా అక్రమ రవాణా అడ్డుకోలేకపోయారు. కొందరు ప్రజాప్రతినిధులు, రాజకీయనాయకుల కనుసన్నల్లో వారి అనుచరుల ద్వారా ఈ అక్రమ రవాణా సాగుతోందని ‘సీమ’లో అందరికీ తెలిసిన బహిరంగ సత్యం.

    ఈ తంతుకు కొందరు అటవీ, పోలీసు అధికారులు కూడా పూర్తిస్థాయిలో సహకరించడం వల్లే రోజూ ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డూఅదుపూ లేకుండా సాగుతోంది. వరుస ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు, వైఎస్సార్‌జిల్లాల్లో భారీగా ఎర్రచందనం ‘సీమ’ సరిహద్దులు దాటి వెళ్లిపోయింది. గత మూన్నెళ్లలో అధికారుల తనిఖీల్లో పట్టుబడిన దుంగల విలువే దాదాపు 97 కోట్ల రూపాయలు ఉంటుందని తెలుస్తోంది.

    ఇక తరలిపోయిన దుంగల విలువ దాదాపు 500 కోట్ల రూపాయల పైనే ఉంటుందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో ఎర్రచందనం అక్రమరవాణాపై గవర్నర్ నరసింహన్ సీరియస్ అయ్యారు. దీంతో అధికారులు అక్రమరవాణాకు అడ్డుకట్ట వేసేందుకు నడుంబిగించారు. తమిళనాడు, కర్ణాటక, చిత్తూరు, వైఎస్సార్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు చెందిన 196 మంది దొంగలతో జాబితా రూపొందించి అరెస్టుల పర్వాన్ని సాగిస్తున్నారు.
     
    టీడీపీ నేతలు ఉండడంతో... మందగించిన అరెస్టులు:

    ప్రధాన స్మగ్లర్లు రెడ్డి నారాయణ, మహేశ్‌నాయుడు తో అరెస్టుల పర్వం మొదలైంది. వీరిద్దరూ వైఎస్సార్ జిల్లాకు చెందిన టీడీపీ నేతలు. వీరితో పాటు పలువురు టీడీపీ నేతలు పోలీసుల ఉచ్చులో చిక్కారు. జాబితాలో టీడీపీ కార్యకర్తలే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వీరంతా అరెస్టుల నుంచి బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జిల్లాకు చెందిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అటవీమంత్రి కావడంతో వీరి పని మరింత సులువు అవుతోంది.

    బుధవారం రాత్రి జాబితాలోని దొంగలు హైదరాబాద్‌లో మంత్రిని కలిసినట్లు తెలుస్తోంది. అరెస్టు కాకుండా అడ్డుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. పార్టీకోసం భారీగా డబ్బులు ఖర్చు చేశామని, తాము ఇబ్బందుల్లో ఉన్నపుడు పార్టీ ఆదుకోవాలని విన్నవించారు. దీంతో వారందరికీ బొజ్జల అభయహస్తం ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘డోండ్ వర్రీ..మై హూనా..అరెస్టులు ఇక వేగంగా ఉండవు. టీడీపీ నేతలు అరెస్టులు అసలు ఉండవు. బాధపడొద్దు’ అని బొజ్జల ధైర్యం చెప్పి పంపించినట్లు తెలుస్తోంది.
     
    చంద్రబాబుదీ అభయహస్తమే
     
    ప్రముఖ స్మగ్లర్లు రెడ్డినారాయణ, మహేశ్‌నాయుడు సతీమణులు మంగళవారం చంద్రబాబును కలిసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఎమ్మెల్యే ఎన్నికల టికెట్ల కేటాయింపులో చక్రం తిప్పిన వైఎస్సార్ జిల్లాకు చెందిన టీడీపీ నేత భార్య ఆధ్వర్యంలో వీరు బాబును కలిసినట్లు సమాచారం. ఈ నెల 24న పీడీ యాక్టు అడ్వయిజరీ బోర్డు సమావేశం ఉందని, అందులో తమ భర్తల ప్రమేయం లేదని తేల్చి, బెయిల్ వచ్చేలా చూడాలని వారు విన్నవించినట్లు తెలుస్తోంది. వీరికి కూడా చంద్రబాబు అభయం ఇచ్చినట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో 24న తమ భర్తలకు బెయిల్ వస్తుందనే ఆశతో వారు ఉన్నారు. ఇదే నిజమైతే ప్రభుత్వ అండతో అడవిదొంగలు ఏ స్థాయిలో రెచ్చిపోతారో ఇట్టే తెలుస్తుంది.
     

>
మరిన్ని వార్తలు