ఎర్రచందనం నిల్వకు.. అధునాతన గోదాములు

25 Oct, 2014 04:17 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, తిరుపతి: స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుం గలను నిల్వ చేసేందుకు తిరుపతిలో అధునాతన గోదాములు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఎర్రచందనం నాణ్యతను పరిరక్షించడంతో పాటు ఇంటిదొంగల బారిన పడకుండా చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆరు గోదాములు నిర్మించనున్నా రు. ఇందుకు రూ.21 కోట్లను మంజూరు చేస్తూ అటవీశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్పీ సింగ్ శుక్రవారం ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నెం: 351) జారీ చేశారు.
 
శేషాచలం అడవుల నుంచి స్మగ్లర్లు ఎర్రచందనాన్ని కొల్లగొట్టి సరిహద్దులు దాటిస్తున్న విషయం విదితమే. పోలీసులు, అటవీశాఖ అధికారులు నిఘా వేసి, తనిఖీలు చేసి అడపాదడపా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇలా స్వాధీనం చేసుకున్న దుంగలను అటవీశాఖ కార్యాల యాల ఆవరణలో ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. ఎండకు ఎండి.. వానకు నానడం వల్ల ఎర్రచందనం దుంగల నాణ్యత తగ్గిపోతూ వస్తోంది. ఏ-గ్రేడ్ ఎర్రచందనం దుంగల నాణ్యత కూడా సీ-గ్రేడ్‌కు తగ్గిపోతోంది.

అటవీశాఖలో ఇంటిదొంగలు చేతివాటం ప్రదర్శిస్తూనే ఉన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న అటవీశాఖ ఉన్నతాధికారులు అధునాతన గోదాములు నిర్మించి.. ఎర్రచందనాన్ని నిల్వ చేయాలని నిర్ణయించారు. 8 వేల టన్నుల ఎర్రచందనం నిల్వ సామర్థ్యంతో ఆరు గోదాములు నిర్మించాలని ప్రతిపాదించారు. ఆ గోదాముల ఆవరణలోనే సెంట్రల్ యాక్షన్ హాల్, అడ్మినిస్ట్రేటివ్, సర్వీసు, సెక్యూరిటీ బ్లాక్‌లు, సీసీ కెమెరాలతో కూడిన సెంట్రల్ మానిటరింగ్ వ్యవస్థ, సోలార్ లైటింగ్ సిస్టమ్, వేబ్రిడ్జి, అంతర్గత రహదారులు ఏర్పాటుచేయాలని సూచించారు.

దీని వల్ల ఎర్రచందనం దుంగల నాణ్యతను కాపాడటంతో పాటు భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదని ప్రతిపాదించారు. వీటిపై అటవీశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్పీ సింగ్ ఆమోదముద్ర వేశారు. తొలి దశలో 4,500 టన్నుల ఎర్రచందనం నిల్వ సామర్థ్యంతో గోదాముల నిర్మాణానికి రూ.పది కోట్లను.. రెండో దశలో 3,500 టన్నుల నిల్వ సామర్థ్యం, అధునాతన సదుపాయాలు కల్పించడానికి మరో రూ.11 కోట్లను విడుదల చేసేలా ఉత్తర్వులు జారీచేశారు. ఈ అధునాతన గోదాము నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించడంతో నెలాఖరులోగా టెండర్ నోటిఫికేషన్ జారీచేసేందుకు అటవీశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు