రెక్కలు తెగిన రంగుల చిలక..!

25 Aug, 2017 07:07 IST|Sakshi
రెక్కలు తెగిన రంగుల చిలక..!

- స్వేచ్ఛాప్రపంచం నుంచి జైలుకు
- బందీ  జీవితంపై విరక్తి
- బెయిల్‌ రాక మనోవేదన
- రెడ్‌‘క్వీన్‌’ సంగీత ఛటర్జి ఆత్మహత్యకు ప్రయత్నం
- ఉలిక్కిపడిన కారాగార వర్గాలు  


ఇరవై ఏళ్లకే మోడల్‌గా ర్యాంప్‌పై క్యాట్‌ వాక్‌. ఒంపు సొంపుల వయ్యారం.. ఆపై విమానంలో విహారం. ఎయిర్‌హోస్టెస్‌గా నవ్వులొలికే ఉద్యోగం. ఒక్కసారిగా జీవితంలో కుదుపు. అదే ఆమె ఊహించని మలుపు. జైలు జీవితం.. చివరకు ఆత్మహత్యాయత్నం. రెండేళ్లుగా నిత్యం వార్తల్లో ఉన్న సంగీత చటర్జీ గురువారం జైల్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిపాలయ్యారు.

సాక్షి, చిత్తూరు: ఎర్రక్వీన్‌ సంగీత చటర్జీ జైలు జీవితం అనుభవించలేక గురువారం చిత్తూరు జైల్లో బలవన్మరణానికి పాల్పడ్డారు.  కోల్‌కతాకు చెందిన సంగీత చటర్జీ 20 ఏళ్లకే మోడల్‌గా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఇదే తరుణంలో ఎయిర్‌ హోస్టెస్‌ ఉద్యోగం దొరికింది. ఇక జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదనుకుంటుండగా చెన్నైకు చెందిన మార్కొండ లక్ష్మణ్‌తో పరిచయం ఆమె జీవితాన్ని అనుకోని మలుపుతిప్పింది.

శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం దుంగలను మలేషియా, దుబాయ్, చైనా ప్రాంతాలకు స్మగ్లింగ్‌ చేసే లక్ష్మణ్‌పై జిల్లాలోని పోలీస్‌ స్టేషన్లలో 15 వరకు కేసులున్నాయి. అప్పటికే పెళ్లయిన లక్ష్మణ్‌ 2013లో సంగీతను రెండో పెళ్లి చేసుకున్నాడు. మరుసటి ఏడాదే ఇతను చిత్తూరు పోలీసులకు చిక్కడంతో పీడీ యాక్టు కింద అరెస్టు చేశారు. భర్త జైల్లో ఉన్న సమయంలో ఎర్రచందనం సామ్రాజ్యాన్ని సంగీత తన చేతుల్లోకి తీసుకుంది. స్మగ్లింగ్‌కు హవాలా రూపంలో డబ్బులు సమకూర్చడం, సరుకును అనుకున్న సమయానికి విదేశాలకు తరలించడంతో కొత్త గుర్తింపు తెచ్చుకుంది.

రెండేళ్లు పోలీసుల కన్నుగప్పి
సంగీతను పట్టుకోవడానికి రెండేళ్లుగా జిల్లా పోలీసులు పడరాని పాట్లు పడ్డారు. గతేడాది ఎట్టకేలకు సంగీతను కోల్‌కతాలో అరెస్టు చేసినా.. చిత్తూరుకు తీసుకురాలేకపోయారు. ఆమె లాకర్లలో ఉన్న 2.5 కిలోల బంగారు ఆభరణాలు, రూ.10 లక్షల నగదు, రూ.60 లక్షల విలువచేసే ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఆమెను ఈ ఏడాది మార్చి 29న కోల్‌కతాలో అరెస్టు చేసి చిత్తూరుకు తరలించారు. జిల్లాలోని కల్లూరు, యాదమరి, నిండ్ర పోలీస్‌ స్టేషన్లలో ఆమెపై కేసులుండగా కల్లూరు, యాదమరి కేసుల్లో సంగీతకు బెయిల్‌ మంజూరైయింది. నిండ్ర కేసులో బెయిల్‌ రాక ఐదు నెలలుగా చిత్తూరు జిల్లా జైల్లో రిమాండు ఖైదీగా ఉన్నారు.

జైలు జీవితం కష్టమే
నిత్యం ఏసీలు, పబ్బులు, విమానాల్లో తిరుగుతూ విలాసవంతమైన జీవితం గడిపిన సంగీత ఛటర్జీ ఓ ఖైదీలా జైల్లో గడపలేకపోయారు. చిత్తూరులోని జిల్లా జైల్లో 150 మందికి పైగా ఖైదీలుంటే ఇందులో ఏడుగురే మహిళలున్నారు. వీరికి హిందీ రాదు. తన మనోభావాలను, బాధలను పంచుకోవడం సంగీతకు సాధ్యం కాలేదు. దీనికి తోడు కేసుల్లో బెయిల్‌ రాక తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. మరుగుదొడ్లను శుభ్రపరిచే యాసిడ్‌ను తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. దీనికి తోడు జైల్లో వేధింపులున్నాయని ఓ సారి.. లేదని మరోసారి సంగీత మీడియాకు తెలిపారు.

సంగీత పొట్ట మొత్తం శుభ్రం చేశామని ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని చిత్తూరు ప్రభుత్వాస్పత్రి వైద్యులు చెబుతున్నారు. గొంతు, శరీరం లోపల ఉన్న సున్నితమైన భాగాలేవైనా దెబ్బతిన్నాయేమో.. చూడాలంటే లేటెస్ట్‌ ల్యాప్రోస్కోపిక్‌ పరీక్ష అవసరమని తిరుపతి రుయాకు రిఫర్‌ చేసినట్లు వైద్యులు తెలిపారు. జైల్లో ఖైదీలు వారానికి ఓ సారి మరుగుదొడ్లు శుభ్రపరచాలని.. సంగీతకు టాయ్‌లెట్‌ క్లీనర్‌ ఇవ్వగా అది తాగడంతో అస్వస్థతకు గురైందని జైలు పర్యవేక్షకులు రాహుల్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు