తిరగబడ్డ ‘ఎర్ర’ కూలీలు

23 Nov, 2014 03:33 IST|Sakshi

చంద్రగిరి: శేషాచలంలో ఎర్రచందనం చెట్లును కూల్చి దుంగలు తరలించడానికి వచ్చిన కూలీలు పోలీసులపై దాడికి యత్నించారు. పోలీసులు అప్రమత్తం కావడంతో వారిని చాకచక్యంగా పట్టుకోగలిగారు. ఈ ఘటన మామండూరు వద్ద ఉన్న అబ్బాలి రామానాయుడు మామిడితోట సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది.

వివరాలను శనివారం పోలీసులు విలేకరులకు తెలిపారు. ఎస్‌ఐ జయచంద్ర మాట్లాడుతూ మామండూరు సమీపంలోని అబ్బారి రామానాయుడు మామిడి తోట సమీపంలో ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా చేస్తున్నట్టు శుక్రవారం రహస్య సమాచారం అందిందన్నారు. సీఐ మల్లికార్జున గుప్తా ఆదేశాల మేరకు ఎస్‌టీఎఫ్ సిబ్బందితో అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించామన్నారు.

కూలీలు గొడ్డళ్లు, కర్రలు, రాళ్లతో  ఒక్కసారిగా దాడికియత్నించారన్నారు. అప్రమత్తమైన పోలీసులు చాకచక్యంతో 17మంది ఎర్రకూలీలను పట్టుకున్నట్టు తెలిపారు. అయితే మరో ఇద్దరు కూలీలు పరారయ్యారన్నారు. పట్టుబడిన వారినుంచి ఓ టాటా సుమో, 20 ఎర్రచందనం దుంగలు,దాడికియత్నించిన గొడ్డళ్లు, కర్రలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కూలీలు తమిళనాడు రాష్ట్రం తిరుత్తణి, ధర్మపురి జిల్లాలకు చెందినవారుగా గుర్తించామన్నారు. అనంతరం కూలీలపై కేసు నమోదు చేసి కోర్టుకుతరలించినట్టు ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తలు