అనైతికం

19 Jul, 2014 02:20 IST|Sakshi

అటవీ గోడౌన్లలో ఎర్రచందనం నిల్వలు అపారంగా ఉన్నాయి. వాటిని గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయిస్తాం. తద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా పెంచుతాం. రుణమాఫీ వంటి హామీలను నెరవేర్చేందుకు ఈ సొమ్ము ప్రభుత్వానికి వెసులుబాటుగా ఉంటుంది.    
 
 సాక్షి ప్రతినిధి, కడప: ఎర్రచందనం అరుదైన ప్రకృతి సంపద. అది రాయలసీమకే సొంతం. ప్రపంచ దేశాల్లో భారీ డిమాండ్ ఉండడంతో అక్రమార్కులు అడ్డంగా అడవులను నాశనం చేస్తున్నారు. 90 శాతం అక్రమ రవాణా అవుతుండగా కేవలం 10శాతం మాత్రమే పట్టుబడుతోంది. అలా పట్టుబడిన ఎర్రచందనం సుమారు 9వేల టన్నులు అటవీ గోడౌన్లలో మగ్గుతోంది. దానిని విక్రయించి రుణమాఫీ చేస్తామని ఓమారు, రాజధాని నిర్మాణానికి ఉపయోగిస్తామని మరోమారు రాష్ట్ర మంత్రులు ఒకరి తర్వాత మరొకరు ప్రకటనలు గుప్పిస్తున్నారు. అమాత్యుల తీరు చూస్తుంటే సొమ్మొకరిది.., సోకొకరిది అన్నట్లుగా ఉందని రాయలసీమ వాసులు నిలదీస్తున్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం విశేష కృషి చేపట్టాల్సిన పాలక పక్షం అలాంటి ఆలోచన చేయడం లేదని మదనపడుతున్నారు. ఎర్రచందనం విక్రయం ద్వారా లభించే ఆదాయాన్ని ఆ ప్రకృతి సంపద లభ్యమయ్యే ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసమే ఖర్చు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
 
 రాష్ట్రంలోని ఏడు ఫారెస్టు డివిజన్లలోనే ..
 ప్రకృతి సంపద అయిన ఎర్రచందనం వైఎస్సార్, చిత్తూరు, కర్నూల్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మాత్రమే లభ్యమవుతోంది. కడప, రాజంపేట, ప్రొద్దుటూరు, తిరుపతి, చిత్తూరు ఈస్ట్, నంద్యాల, గిద్దలూరు, నెల్లూరు ఫారెస్టు డివిజన్లలోనే ఎర్రచందనం అక్రమనిల్వలు ఉన్నాయి. ప్రధానంగా వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో ఎర్రచందనం అపారంగా ఉంది. ఇక్కడి నుంచి ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. అటవీ చెక్‌పోస్టులు, పోలీసులు ద్వారా పట్టుబడిన ఎర్రచందనం 8,870 టన్నుల నిల్వలు ఉన్నట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. విదేశాలకు ఎగుమతి చేసే సందర్భాలలో పోర్టులు వ ద్ద డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్సీ (డీఆర్‌ఐ) దాడులు చేసినప్పుడు స్వాధీనం చేసుకున్న చందనం వేల టన్నుల్లో ఉన్నట్లు సమాచారం.
 
 ఎర్రచందనం ఎక్కడ పట్టుబడ్డా విక్రయాలు మాత్రం ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టాలని 2011లో కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎర్రచందనం నిల్వలను విక్రయించి తాను ఇచ్చిన ఎన్నికల హామీల కోసం వెచ్చించాలని చంద్రబాబు నాయుడు భావిస్తుండటాన్ని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజానీకం ఆక్షేపణ వ్యక్తం చేస్తోంది. ఎర్రచందనం ద్వారా లభించే రూ.1000 కోట్లు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసమే ఖర్చు చేయాలనే డిమాండ్ ఊపుందుకుంటోంది. సాగునీటి పనులుకు, భూగర్భజలాలు పెంపొందించే కార్యక్రమాలకు ఈ సొమ్మును వినియోగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
 
 సీమలోనే ఖర్చు చేయాలి...
 ఎర్రచందనం విక్రయం ద్వారా లభించే ఆదాయం రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలోనే ఖర్చు చేయాలి. ఇక్కడి సాగునీటి ప్రాజెక్టులకు వినియోగించాలి. ఈప్రాంతం ప్రజల హక్కు అది. ఎర్రచందనాన్ని ఆదాయ వనరుగా  చూడడమే పెద్ద తప్పు. హామీల  అమలు కోసం ఎర్రచందనం సొమ్మును వినియోగించుకోవాలనుకోవడం తీవ్ర ఆక్షేపణీయం.
 - దేవగుడి చంద్రమౌళీశ్వరరెడ్డి,
 తుంగభద్ర జలాల సాధన కమిటీ నాయకుడు,
 
 చెరువుల పునః నిర్మాణం కోసం వెచ్చించాలి....
 ఎర్రచందనం విక్రయం ద్వారా లభించే ఆదాయాన్ని రాయలసీమలో చెరువులను పునః నిర్మించేందుకు ఉపయోగించాలి.ఇప్పటికే రాయలసీమ ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉంది. ఇక్కడి సంపద ద్వారా వచ్చే డబ్బును  వేరెక్కడో ఖర్చు చేస్తామనడం ఎంతమాత్రం భావ్యం కాదు.
 - బొజ్జా దశరథరామిరెడ్డి, రాయలసీమ
 ఐక్యకారాచరణ కార్యదర్శి నంద్యాల.
 

మరిన్ని వార్తలు