జిల్లా అభివృద్ధిపై మంత్రికి శ్రద్ధలేదు

6 Apr, 2016 23:44 IST|Sakshi

 శ్రీకాకుళం అర్బన్: ప్రజా సమస్యలు పరిష్కారంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని జూట్‌మిల్లులు, ఆయిల్ మిల్లులు, రైస్ మిల్లులు, పైపుల ఫ్యాక్టరీలు, సింథటిక్ ప్యాక్టరీలు మూతపడటంతో కార్మికులు రోడ్డున పడుతున్నప్పటికీ కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకి చీమకుట్టనట్టు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధిపై మంత్రి దృష్టి సారించకుండా, జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడానికే ప్రాధాన్యం ఇవ్వడం శోచనీయమన్నారు.
 
 పక్కా గృహాలకు నోచుకోని మత్స్యకారులు
 జిల్లాలోని 194 కిలోమీటర్ల తీర ప్రాంతంలో 11 మండలాలు, 104 గ్రామాలు విస్తరించి ఉన్నాయని, ఆయా గ్రామాల్లో 40 వేల మత్స్యకార కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నాయని చెప్పారు. తీర గ్రామాల ప్రజలు తాగునీరు, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నా... ప్రభుత్వానికి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారులు పక్కా గృహాలకు నోచుకోకుండా నేటికీ పూరి గుడిసెల్లో దుర్భర జీవితం గడుపుతున్నారని అన్నారు. జిల్లాలో హుద్‌హుద్ తుపాను వల్ల 6,474 ఇళ్లు నేల మట్టం కాగా, ప్రభుత్వం 1500 ఇళ్లు మంజూరు చేసి, చేతులు దులుపుకుందని ధ్వజమెత్తారు. ఇందులో 300 గృహాలే నిర్మాణం పూర్తయ్యాయని చెప్పారు.
 
 నెలకు రూ.50 లక్షల విద్యుత్ భారం
  ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచడం వల్ల జిల్లాలో 6.50 లక్షలు గృహ కనెక్షలపై  నెలకు సుమారు రూ.50 లక్షల అదనపు భారం పడనుందన్నారు. రుణమాఫీ వర్తించక జిల్లాలో 10 వేలకు పైగా డ్వాక్రా సంఘాలు రద్దయ్యే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వి.పద్మావతి, జిల్లా అధికార ప్రతినిధి శిమ్మ రాజశేఖర్, పార్టీ నేతలు మండవిల్లి రవి, చల్లా అలివేలు మంగ, టి.కామేశ్వరి, కోరాడ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
 

whatsapp channel

మరిన్ని వార్తలు