టాస్క్‌ఫోర్స్ పోలీసులపై స్మగ్లర్ల రాళ్లదాడి

14 Dec, 2017 10:44 IST|Sakshi

 -బరితెగించిన ఎర్రకూలీలు- కానిస్టేబుల్‌కు గాయాలు- పైలట్‌తో పాటు ఇద్దరు కూలీల అరెస్టు

సాక్షి, కాశీనాయన/ చంద్రగిరి : వైఎస్సార్‌ జిల్లా పోరుమామిళ్ళ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని నల్లమల అడవుల్లోను, చిత్తూరు జిల్లా నాగపట్ల ఈస్టు బీట్‌ పరిధిలోని శేషాచల అటవీ ప్రాంతం శ్రీవారిమెట్టు వద్ద పోలీసులు పెద్దఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. బుధవారం అర్థరాత్రి కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు రాళ్లతో దాడి చేసి పారిపోయారు. ఈ సంఘఠనలో ఒక కానీస్టేబుల్‌ గాయపడ్డాడు. దాడిచేసినవారిపై పోలీసులు రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఈ సందర్భంగా 47 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలువురు ఎర్రచందనం కూలీలు పోలీసుల అదుపులో ఉన్నట్లు చెబుతున్నారు. ఆర్‌ఎస్సై వాసు, డీఆర్వో పీవీఎన్‌.రావు  బృందం బుధవారం అర్ర్థరాత్రి నాగపట్ల ఈస్టు బీట్‌ పరిధిలోని శేషాచల అటవీ ప్రాంతం శ్రీవారిమెట్టు వద్ద కూంబింగ్‌ నిర్వహించారు. ఈ క్రమంలో తమిళనాడు జావాదిమలైకు చెందిన మురుగన్‌ అనుమానాస్పదంగా తచ్చాడుతుండటంతో అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. తాను ఎర్రచందనం కూలీలకు పైలట్‌గా వచ్చానని అతను చెప్పడంతో, అతన్ని తీసుకుని శ్రీవారిమెట్టు మార్గంలోని పంప్‌హౌస్‌ సమీప అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహించారు. కూలీలు దుంగలు మోసుకొస్తూ కనిపించడంతో అధికారులు వారిపై దాడులు చేశారు. కూలీలు వారి వద్దనున్న కర్రలు, రాళ్లతో ఎదురుదాడికి దిగారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్‌ లక్ష్మీనారాయణ చేతికి గాయమైంది. దాంతో అధికారులు  గాల్లో కాల్పులు జరపగా, ఎర్రకూలీలు అటవీ ప్రాంతంలోకి పరుగులు పెట్టారు. చివరకు తమిళనాడు తిరువణ్ణామలైకు చెందిన చిన్నప్పయ్య, స్వామినాథన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు జిల్లాల పరిధిలో ఎర్ర కూలీల నుంచి సుమారు 47 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దాడిలో గాయపడ్డ పీసీ లక్ష్మీనారాయణకు మెరుగైన వైద్యంకోసం తిరుపతి రుయాకు తరలించారు. 

మరిన్ని వార్తలు