లాక్‌డౌన్‌లో గృహిణి సురక్షితం

8 Jun, 2020 04:20 IST|Sakshi

మామూలు రోజులతో పోలిస్తే.. లాక్‌డౌన్‌ వేళలో తగ్గిన గృహహింస

కుటుంబ సభ్యుల మధ్య పెరిగిన అనుబంధాలే కారణం

గత నాలుగేళ్లతో పోలిస్తే తక్కువ కేసుల నమోదు 

అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై పెరిగిన వేధింపులు

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై గృహ హింస పెరిగితే.. మన రాష్ట్రంలో మాత్రం తగ్గింది. ఆ సమయంలో బాధితులు నేరుగా పోలీస్‌స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేసే అవకాశం లేకపోవడంతో ఏపీ ప్రభుత్వం పలు మార్గాల్లో పోలీసులకు ఫిర్యాదు చేసే ఏర్పాట్లు చేసింది. అయినా ఇక్కడ గృహహింస కేసులు తక్కువగానే నమోదు కావడం విశేషం. లాక్‌డౌన్‌ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య బంధాలు మరింత బలపడటం వల్లే గృహహింస తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. 

► రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమల్లోకొచ్చిన మార్చి 22(జనతా కర్ఫ్యూ) నుంచి మే మూడో తేదీ వరకు పోలీస్‌ రికార్డులను పరిశీలిస్తే.. 2016లో 986 గృహ హింస కేసులు నమోదయ్యాయి. 2017లో 1,142 కేసులు, 2018లో 886 కేసులు, 2019లో 841, ఈ ఏడాది మాత్రం కేవలం 197 కేసులే నమోదయ్యాయి. 
► గృహహింస బాధితులు లాక్‌డౌన్‌ కారణంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసే అవకాశం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ హెల్ప్‌లైన్‌ సెంటర్‌ 181తో పాటు, అన్ని జిల్లాల్లోనూ ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ సెంటర్లు ఏర్పాటు చేసింది.
► ఏపీ మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో 9701056808, 9603914511 వాట్సాప్‌ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. డయల్‌ 100తో పాటు దిశ యాప్‌ను కూడా మహిళలు వినియోగించుకునే ఏర్పాట్లు చేసింది.  

ప్రపంచవ్యాప్తంగా పెరిగిన గృహ హింస కేసులు
​​​​​​​► మామూలు రోజుల కంటే లాక్‌డౌన్‌ సమయంలో బ్రిటన్‌లో ఐదు రెట్లు, ఫ్రాన్స్‌లో మూడు రెట్లు గృహ హింస కేసులు పెరిగాయి. అమెరికా, చైనాల్లోనూ ఇదే పరిస్థితి. 
​​​​​​​► ఇటలీ, స్పెయిన్‌ దేశాల్లో గృహహింస బాధితుల కోసం అనేక చర్యలు తీసుకుంటున్నారు. బాధిత మహిళలు తమ భాగస్వామికి దూరంగా ఉండేలా వారికి హోటల్‌ గదులు అద్దెకిస్తున్నారు. 
​​​​​​​► పలు దేశాల్లో భాగస్వాముల్లో ఇద్దరి ఉద్యోగాలూపోయి వాళ్లు ఒకే ఇంట్లో సమయమంతా గడపాల్సి వస్తే గృహహింస మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులంటున్నారు. 

బలపడిన కుటుంబ బంధాలే కారణం
రాష్ట్రంలో కుటుంబ సంబంధాలు బలంగా ఉంటాయి. దీనికి తోడు లాక్‌డౌన్‌ కారణంగా అంతా ఇళ్లల్లోనే ఉండటంతో వారి మధ్య బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు మరింత బలపడ్డాయి. మద్యం తాగినప్పుడో, ఇతర దురలవాట్లు ఉంటేనో మహిళలను వేధిస్తుంటారు. లాక్‌డౌన్‌లో మద్యాన్ని నిషేధించడం కూడా గృహిణులపై హింస తగ్గుదలకు మరో కారణంగా చెప్పొచ్చు. అక్షరజ్ఞానం లేనివారు సైతం లాక్‌డౌన్‌ సమయంలో మహిళలను కొట్టడం, దౌర్జన్యం చేయడం దాదాపుగా తగ్గించారు.
– డాక్టర్‌ వెంకట్రాముడు, మానసిక వైద్య నిపుణుడు, కడప వైద్యకళాశాల

మరిన్ని వార్తలు