శ్రీశైలానికి తగ్గిన వరద

29 Sep, 2019 04:16 IST|Sakshi
సాగర్‌ నుంచి దిగువకు కృష్ణమ్మ పరవళ్లు

శ్రీశైలం నుంచి 1,80,419 క్యూసెక్కులు విడుదల

ప్రకాశం బ్యారేజీ నుంచి 2.23 లక్షల క్యూసెక్కుల నీరు కడలిలోకి.. 

గోదావరి వంశధారల్లో స్థిరంగా వరద ప్రవాహం

సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్‌/విజయరిపురిసౌత్‌ (మాచర్ల): శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుతోంది. శుక్రవారం రాత్రి 10 గేట్లను తెరిచిన డ్యామ్‌ అధికారులు ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోను దృష్టిలో ఉంచుకుని శనివారం ఈ సంఖ్యను తగ్గించారు. నాలుగు గేట్లను 10 అడుగుల మేర తెరిచి స్పిల్‌వే ద్వారా 1,11,748 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు. రెండు జలవిద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పాదన అనంతరం 68,671 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల, హంద్రీ నుంచి శ్రీశైలం జలాశయానికి 1,44,650 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. నాగార్జున సాగర్‌ నుంచి కుడి, ఎడమ కాలువలకు 14 వేలు.. 10 రేడియల్‌ క్రస్ట్‌గేట్లను ఎత్తి 1,49,140 క్యూసెక్కులు దిగువకు, విద్యుదుత్పత్తి ద్వారా 32,886, డైవర్షనల్‌ టన్నెల్‌కు 10, ఎస్‌ఎల్‌బీసీకి 2,400, వరద కాలువకు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌ నీరు, మూసీ వరదతో పులిచింతల ప్రాజెక్టులోకి 2.52 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. 

పులిచింతలలో 8 గేట్లు ఎత్తి 2.80 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి 2.58 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. డెల్టా కాలువలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 2.23 లక్షల క్యూసెక్కులను 70 గేట్లు ఎత్తి సముద్రంలోకి వదులుతున్నారు. గోదావరిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 3.40 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. డెల్టాకు నాలుగు వేల క్యూసెక్కులు విడుదల చేసి మిగులుగా ఉన్న 3.36 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వంశధార నది నుంచి గొట్టా బ్యారేజీలోకి 15,396 క్యూసెక్కులు వస్తుండగా.. కాలువలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 14,579 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. 

మరిన్ని వార్తలు