శాంతిస్తున్న కృష్ణమ్మ

18 Aug, 2019 03:34 IST|Sakshi
ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం

ప్రకాశం బ్యారేజీలోకి తగ్గిన వరద ఉధృతి

6.43 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. 7.56 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల

ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, సాగర్‌లలో క్రమేణా తగ్గుతున్న ప్రవాహం

నేటినుంచి మరింత తగ్గనున్న వరద

సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్‌: మహోగ్ర రూపం దాల్చిన కృష్ణమ్మ శాంతిస్తోంది. శనివారం రాత్రి ఏడు గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే వరద ప్రవాహం 6.43 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. బ్యారేజీలో నిల్వ సామర్థ్యం కంటే అధికంగా నీరు ఉండటంతో 70 గేట్లు ఎత్తి 7.56 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల్లో శనివారం వరద ప్రవాహం తగ్గిన నేపథ్యంలో ఆదివారం నుంచి ప్రకాశం బ్యారేజీ వద్ద తగ్గనుంది. పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణా నదిలో ఎగువన వరద ప్రవాహం క్రమేణా తగ్గుతోంది. ఆల్మట్టిలోకి 4.45 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా, 4.20 క్యూసెక్కులను, నారాయణపూర్‌లోకి 3.80 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. 3.42 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.

ఉజ్జయిని జలాశయంలోకి భీమా నది ద్వారా 12,351 క్యూసెక్కులు చేరుతుండగా.. 8,450 క్యూసెక్కులు, జూరాలలోకి కృష్ణా, భీమా నదుల నుంచి 5.65 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. 5.33 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. తుంగభద్రలో ప్రవాహ ఉద్ధృతి నిలకడగా కొనసాగుతోంది. తుంగభద్ర జలాశయంలోకి 78 వేల క్యూసెక్కులు వస్తుండగా.. అంతే స్థాయిలో దిగువకు వదులుతున్నారు. కృష్ణా, తుంగభద్రల నుంచి శ్రీశైలంలోకి 6.54 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 7.47 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్‌లోకి 6.08 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో దిగువకు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్ట్‌లోకి 6.48 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. 6.65 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం 12 అడుగుల నీటిమట్టంతో 3.07 టీఎంసీ నీరు నిల్వ ఉంది.

మరిన్ని వార్తలు