కేంద్ర పన్నుల కేటాయింపుల్లో కోత!

2 Feb, 2020 05:04 IST|Sakshi

పంపిణీలో ఏపీ వాటా తగ్గింపు

4.305 నుంచి 4.11 శాతానికి పడిపోయిన వైనం

ఫలితంగా 2020–21 ఆర్థిక సంవత్సరానికి రూ.1,521 కోట్ల నష్టం

2011 జనాభా లెక్కల ప్రాతిపదికన తీసుకున్న ఫలితం

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా మదింపునకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్దేశించిన 15వ ఆర్థిక సంఘం విధివిధానాలు ఏపీతోపాటు పలు దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపాయి. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 42 శాతం వాటా పంచారు. దీని నుంచి ఏపీకి ఏటా 4.305 శాతం మేర పంచుతూ వస్తున్నారు. కానీ, ఇప్పుడు అది 4.11 శాతానికి తగ్గిపోయింది. ఇదేకాక.. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంచాల్సిన వాటాను సైతం 42 శాతం నుంచి 41 శాతానికి తగ్గించారు.

ఏడో ఆర్థిక సంఘం నుంచి 14వ ఆర్థిక సంఘం వరకు 1971 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని వాటాలను నిర్దేశించి కేంద్రం పన్నులను పంచింది. కానీ, ఇప్పుడు 2011 జనాభా లెక్కల ఆధారంగా పన్నుల వాటాను కేటాయిస్తోంది. మరోవైపు.. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఏప్రిల్‌ 1, 2020 నుంచి అమల్లోకి రావాల్సి ఉన్నప్పటికీ.. పూర్తిస్థాయి నివేదిక సిద్ధం కానందున కేవలం 2020–21కు వర్తించేలా మధ్యంతర నివేదిక ఇచ్చింది. దానిని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దీని ఆధారంగానే 2020–21 ఆర్థిక సంవత్సరానికి పన్నుల వాటాలను నిర్దేశిస్తూ ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలో బడ్జెట్‌లో పొందుపరిచారు. ఒకవేళ పదిహేనో ఆర్థిక సంఘం రాష్ట్రాలకు పంచాల్సిన వాటాను 41 శాతం నుంచి ఇంకా తగ్గిస్తే అప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు నిధుల లేమిని ఎదుర్కోవలసి వస్తుంది. 

జనాభాను పటిష్టంగా నియంత్రించిన ఫలితం..
కాగా, 15వ ఆర్థిక సంఘం విధివిధానాల్లో పన్నుల వాటాలు తేల్చేందుకు జనాభాకు 15 శాతం వెయిటేజీ ఇచ్చారు. జనాభా వృద్ధి రేటు విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక తదితర రాష్ట్రాలు పకడ్బందీగా వ్యవహరించి మంచి ఫలితాలు సాధించాయి. కానీ, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలు జనాభాను నియంత్రించలేకపోయాయి. దీని ఫలితంగా 2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకోవడంవల్ల దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటా తగ్గింది. 

2020–21కి కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా (అంచనాలు) ఇలా..
కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా 4.305 శాతం నుంచి 4.11కి తగ్గింది. కొత్త వాటా ప్రకారం కేంద్ర పన్నుల వాటా నుంచి ఏపీకి రూ.32,237.68 కోట్లు రానున్నట్లు కేంద్ర బడ్జెట్‌లో అంచనా వేశారు. ఇందులో కార్పొరేషన్‌ టాక్స్‌ రూ. 9,916.22 కోట్లు, ఆదాయ పన్ను రూ.9,220.31 కోట్లు, సెంట్రల్‌ జీఎస్టీ రూ.9,757.50 కోట్లు, కస్టమ్స్‌ టాక్స్‌ రూ.2,012.13 కోట్లు, కేంద్ర ఎక్సైజ్‌ డ్యూటీ రూ.1,314.66 కోట్లు, సర్వీస్‌ టాక్స్‌ రూ.17.19 కోట్లుగా ఉంది. అయితే, గడిచిన రెండు మూడేళ్ల కాలంలో బడ్జెట్‌లో పొందుపరిచిన అంచనాల మేరకు నిధులు రాలేదు. పొందుపరిచిన అంచనాల కంటే వెయ్యి కోట్ల నుంచి రెండు వేల కోట్ల వరకు తక్కువే వచ్చాయి.

ఏపీకి రూ.1,521 కోట్ల నష్టం
కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా 4.305 శాతం నుంచి 4.11కి తగ్గడంవల్ల 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1,521 కోట్ల మేర ఆదాయాన్ని రాష్ట్రం కోల్పోతుంది. 4.305 శాతం వాటా ఉంటే రూ.33,758.98 కోట్లు రావాల్సి ఉండగా.. ఇప్పుడు రూ.32,237.68 కోట్లు మాత్రమే రానుంది. 

మరిన్ని వార్తలు