ఎస్సీ, ఎస్టీలకు అర్హత మార్కులు తగ్గింపు

8 Oct, 2019 04:26 IST|Sakshi

సచివాలయాలకు సంబంధించి జిల్లాల్లో ఆయా కేటగిరీలకు కేటాయించిన 

పోస్టులు పూర్తిగా భర్తీ కాని చోటే..బీసీ, జనరల్‌ అభ్యర్థులకు కనీస అర్హత మార్కుల తగ్గింపుపై ఈ నెల 15 తర్వాత స్పష్టత 

ఇప్పటికి 1,01,454 మందికి కాల్‌లెటర్లు

సాక్షి, అమరావతి: ‘సచివాలయ’ ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీలకు రాతపరీక్షల్లో కనీస అర్హత (క్వాలిఫై) మార్కులను తగ్గించారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన పోస్టులకు సరిపడా ఆయా కేటగిరీల అభ్యర్థులు రాత పరీక్షల్లో కనీస మార్కులు తెచ్చుకోలేని జిల్లాల్లో.. లేని పోస్టుల్లో మాత్రమే అర్హత మార్కులు తగ్గించి, ఆ పోస్టులను భర్తీ చేయాలని ఇప్పటికే పంచాయతీరాజ్, మున్సిపల్‌ శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లో జిల్లాల్లో పోస్టులు పూర్తిగా భర్తీ కాని వాటికి కనీస అర్హత మార్కులు తగ్గించి, నియమించడానికి కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా ఎంపిక కమిటీ(డీఎస్సీ)లు చర్యలు చేపట్టాయి. సచివాలయ ఉద్యోగ రాతపరీక్షల్లో ఓసీలకు 60, బీసీలకు 52.50, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 మార్కులను కనీస అర్హత మార్కులుగా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ కనీస అర్హత మార్కులు తెచ్చుకున్న వారినే ఉద్యోగం పొందేందుకు అర్హులుగా పేర్కొంటూ డీఎస్సీలు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు పిలుస్తున్నాయి. అయితే.. పలు జిల్లాల్లో వివిధ రకాల ఉద్యోగాల రాతపరీక్షల్లో కనీస అర్హత మార్కులు తెచ్చుకున్న వారు తగినంత మంది లేక ఖాళీలు మిగిలిపోయాయి. 

నిర్దేశిత అర్హత మార్కులు సాధించినవారు లేక..
1,26,728 సచివాలయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ 1–8 మధ్య పరీక్షలు జరిగాయి. జిల్లాల్లో పోస్టుల వారీగా, రిజర్వేషన్ల వారీగా భర్తీ చేయాల్సిన ఉద్యోగాలకు సరిపడా అర్హత సాధించిన వారు లేక శనివారం సాయంత్రం వరకు 1,01,454 మంది అభ్యర్థులకు మాత్రమే డీఎస్సీలు కాల్‌లెటర్లు పంపాయి. సచివాలయ ఉద్యోగాల నోటిఫికేషన్‌లోనే అవసరమైన జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులు తగ్గిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాల్లో పోస్టులవారీగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కేటాయించినవాటికి కనీస అర్హత మార్కులను తగ్గించి సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌కు హాజరు కావాలని వారికి సమాచారం పంపుతున్నారు. ఈ పోస్టులను ఈ నెల 14లోపు ముగించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 

సీఎం నిర్ణయం మేరకు జనరల్, బీసీ కేటగిరీల కటాఫ్‌ తగ్గింపు!
పలు జిల్లాల్లో వివిధ రకాల ఉద్యోగాలు బీసీ, జనరల్‌ కేటగిరీల్లో మిగిలిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ కేటగిరీల అభ్యర్థులకు రాత పరీక్షల్లో కనీస అర్హత మార్కులు తగ్గించాలంటే ముఖ్యమంత్రి స్థాయిలో లేదా రాష్ట్ర మంత్రివర్గం ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అక్టోబర్‌ 15న జిల్లాల వారీగా జనరల్, బీసీ కేటగిరీల్లో మిగిలిపోయే పోస్టుల వివరాలను ప్రభుత్వం ముందు ఉంచనున్నట్టు తెలిపారు. ఆ తర్వాత కటాఫ్‌ తగ్గింపుపై స్పష్టత ఉండొచ్చని అంటున్నారు.  

మరిన్ని వార్తలు