ఆగని ఎర్ర చందనం స్మగ్లింగ్

13 Oct, 2014 02:34 IST|Sakshi
ఆగని ఎర్ర చందనం స్మగ్లింగ్

బద్వేలు :
 ఎన్ని చర్యలు తీసుకున్నా ఎర్రచందనం స్మంగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. బద్వేలు ఆటవీ శాఖ పరిధిలో రెండు నెలల వ్యవధిలో ఆరు పర్యాయాలు ఎర్రచందనం దుంగలు అటవీ, పోలీసు అధికారులకు పట్టుబడడమే ఇందుకు నిదర్శనం. బ్రహ్మంగారి మఠం పరిధిలో రవాణాకు సిద్ధంగా ఉన్న 50 ఎర్రచందనం దుంగలు, ఐదు వాహనాలను గత వారం రోజుల్లో పోలీసులు పట్టుకున్నారు. వీరిలో మఠం మండలానికి చెందిన టీడీపీ నేత బంధువులు ఉన్నట్టు సమాచారం.

పోరుమామిళ్ల మండలానికి చెందిన కమ్మవారిపల్లెకు చెందిన ముఖ్య నేత సోదరుడి కుమారులు రవి, శేఖర్ కూడా నిందితులుగా ఉన్నారు. వీరు పట్టుబడాల్సి ఉంది. వీరిపై కేసు లేకుండా చేసేందుకు మైదుకూరు, కమ్మవారిపల్లెకు చెందిన కొందరు టీడీపీ నేతల ద్వారా పోలీసులపై తీవ్ర ఒత్తిడి తీసుకు వచ్చినా ప్రయోజనం లేకపోయింది. పోలీసులు వీరిపై కేసులు నమోదు చేశారు. ఎర్రదుంగల దొంగలపై బద్వేలు పోలీ సులు ప్రత్యేక దృష్టి సారించారు. గత రెండు నెలల వ్యవధిలో ఐదు పర్యాయాలు స్మగ్లర్లను అరెస్టు చేసి, కేసులు నమోదు చేశారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో పది మంది తమిళ కూలీలు కూడా ఉన్నారు. గత నెలలో అటవీ శాఖ అధికారులు రాణిబావి సమీపంలో రవాణాకు సిద్ధంగా ఉన్న 190 దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

 కొన్ని పర్యాయాలు స్మగ్లింగ్‌కు అంబులెన్సులను కూడా వినియోగిస్తున్నారు. బద్వేలులో ఇటీవల ఓ అంబులెన్స్ పట్టుబడింది. దీంతో పాటు బద్వేలు సరిహద్దు ప్రాంతంలోని నెల్లూరు పరిధిలో భారీ డంపును అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ దాదాపు 400కు పైగా దుంగలను గత నెలలో అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, అటవీ శాఖ అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నా వీటి రవాణా మాత్రం ఆగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నారుు.

మరిన్ని వార్తలు