నూనెలు సలసల

14 Dec, 2017 11:53 IST|Sakshi

లీటరుపై రూ.7 పెరుగుదల

రిఫైన్డ్‌తో పాటు పామాయిల్‌దీ అదే బాట

సామాన్యుడి నెత్తిపై మరో బాదుడు

కిలో రూ.200కు ఎగబాకిన చింతపండు

సాక్షి, విశాఖపట్నం: నింగిలో విహరిస్తున్న కూరగాయల ధరలకు నూనెలు, చింతపండూ తోడయ్యాయి. ఇవి ఏకమై సామాన్యుడిపై దాడి చేస్తున్నాయి. దాదాపు రెండున్నర నెలలుగా కాయగూరలు కారాలూ మిరియాలూ నూరుతున్నాయి. ఒక్క బంగాళాదుంపలు తప్ప మరే దుంపలూ, కూరగాయలూ కిలో రూ.30 నుంచి 100కు పైగానే ఎగబాకాయి. కార్తీకమాసం, అకాల వర్షాల పేరు చెప్పి వీటి ధరలను అమాంతం పెంచేశారు. కార్తీకమాసం పూర్తయినా వీటి రేట్లు నామమాత్రంగానే దిగివచ్చాయి. ప్రస్తుతం కిలో ఉల్లి రూ.50కి పైన ఉండగా, క్యారెట్‌ రూ.70 నుంచి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఇప్పటికీ పలు కూరగాయలు కిలో రూ.30 నుంచి 60 మధ్య పలుకుతున్నాయి. ఈ తరుణంలో వంట నూనెల ధరలు కూడా వాటికి వంత పాడుతున్నాయి.

కొన్నాళ్లుగా లీటరు రిఫైన్డ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ప్యాకెట్టు రూ.76 నుంచి 78 మధ్య లభించేది. కొద్దిరోజుల క్రితం ఒక్కో ప్యాకెట్టుకు రూ.6–8 వరకు పెంచేశారు. దీంతో అది రూ.84 వరకు పెంచి విక్రయిస్తున్నారు. అలాగే రూ.62 ఉండే లీటరు పామాయిల్‌ ఇప్పుడు రూ.68–70కి పెరిగింది. హోల్‌సేల్‌లో 15 కేజీల రిఫైన్డ్‌ ఆయిల్‌ డబ్బా రూ.1180, పామాయిల్‌ రూ.980 ఉండేది. ఇప్పుడు రిఫైన్డ్‌ ఆయిల్‌ రూ.1250, పామాయిల్‌ రూ.1060కు చేరింది. ఇలా లీటరు ప్యాకెట్‌పై సగటున రూ.7, డబ్బాపై రూ.80 వరకు పెరిగింది.

పెరిగిన ధరలను వ్యాపారులు వెనువెంటనే అమలులోకి తెచ్చారు. ఇటీవల ప్రభుత్వం నూనెలపై ఎక్సైజ్‌ డ్యూటీని 7.5 శాతం పెంచింది. ఇదే నూనెల ధరలు పెరుగుదలకు దారితీశాయని వ్యాపారులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా మలేసియా మార్కెట్‌ ఆధారంగా నూనెల ధరల పెరుగుదల, తగ్గుదల ఉంటుంది. ఇప్పుడిప్పుడే మలేసియా మార్కెట్‌లో ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో నాలుగైదు రోజుల క్రితం నుంచే వంట నూనెల ధరలు తగ్గుతున్నా, పాత ధరకు కొనుగోలు చేసిన నిల్వలుండడంతో వ్యాపారులు ఆ మేరకు ఇంకా పూర్తి స్థాయిలో ధరలు తగ్గించడం లేదు.  

చింతపండుదీ అదే దారి..
ఇక చింతపండు కూడా కూరగాయలు, నూనెల ధరతో పోటీ పడుతోంది. నిన్న మొన్నటి దాకా పిక్కతో ఉన్న కిలో చింతపండు రూ.60–70, పిక్క తీసినది రూ.120–130 వరకు లభించేది. ఇప్పుడు ఏకంగా యాభై శాతానికి పైగా పెరిగిపోయింది. అంటే అరకిలో రూ.100, కిలో రూ.190–200కు పెరిగిపోయింది. హోల్‌సేల్‌ మార్కెట్లో 15 కిలోల పిక్కతీసిన చింతపండు నెల రోజుల క్రితం రూ.1650 ఉండేది. ఇప్పుడది రూ.2400కు ఎగబాకింది. చింతపండు నిల్వలు తగ్గిపోయాయన్న సాకుతో మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టిస్తూ అధిక ధరలకు అమ్ముతున్నారు. అంతేకాదు.. మున్ముందు ఇంకా పెరిగిపోతుందన్న ప్రచారాన్ని కూడా విస్తృతం చేస్తున్నారు. ఇలా ఇప్పటికే కూరగాయల ధరలతో సతమతమవుతున్న సగటు మధ్య తరగతి వారికి నిత్యావసర సరకులైన వంట నూనెలు, చింతపండు ధరలు కూడా మంట పెట్టిస్తుండడంతో ఆవేదన చెందుతున్నారు. ధరల నియంత్రణపై ప్రభుత్వం చోద్యం చూస్తుండడంపై తీవ్రంగా మండి పడుతున్నారు.

మరిన్ని వార్తలు