రైతు పారకు కేరాఫ్‌ వండానపేట

19 Jul, 2019 08:57 IST|Sakshi

సాక్షి, రేగిడి : ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైందంటే చాలు రైతులంతా పొలం పనుల్లో నిమగ్నమవుతుంటారు. ఇదే సమయంలో సాగుకు సంబంధించి పార, నాగళి, కొడవలి.. తదితర అన్నిరకాల వస్తు సామగ్రిని సిద్ధం చేసుకుంటారు. వర్షాలు ప్రారంభం కావడంతో రైతులు దుక్కులు చేపట్టి పొలాలు గట్లను చదునుచేయాల్సి ఉంది. ఈ పనులకు పారలు ఎంతో అవసరం. జిల్లావ్యాప్తంగా ఉన్న మార్కెట్ల కంటే రేగిడి మండలంలోని వండానపేట గ్రామంలో లభ్యమయ్యే పారలకే ఎక్కువ గిరాకీ.  

ఉంగరాడమెట్టకు రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ చిన్నపల్లెలో ఖరీఫ్‌ సీజన్‌ వచ్చిందంటే వడ్రంగుల ఇళ్లు కళకళలాడుతుంటాయి. ఇంటి ముందర పారలు తయారీచేసే షెడ్డులో రైతులు కిటకిటలాడుతుంటారు. వీరంతా ఈ మండలానికి చెందిన రైతులే కాకుండా సుదూర ప్రాంతాలు నుంచి కూడా వస్తుంటారు. జిల్లా రైతులతో పాటు చీరాల, గుంటూరు, విజయనగరం, విజయవాడ, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి వ్యాపారలు, రైతులు వచ్చి ఇక్కడ పారలు కొనుగోలు చేస్తుంటారు.   

నాణ్యతలో మేటి..
ఈ పారలు సాధారణంగా అడుగున్నర నుంచి రెండు అడుగుల పొడవు, 9 నుంచి 12 ఇంచీల వెడల్పు ఉంటాయి. కొన్ని పారల వెడల్పు మరింత ఎక్కువగా ఉంటుంది. వీటికి వాడే ఇనుప రేకులును ముడిసరుకు రూపంలో విజయనగరంలో కొనుగోలు చేస్తుంటారు. ప్రత్యేకంగా ఇరుడుకర్రను వినియోగిస్తారు. ఈ కర్ర అన్ని ప్రాంతాల్లో దొరకదు. ముడిసరుకులో కల్తీలేకుండా బొగ్గులు పొయ్యిలో ఇనుము కరిగించి పారను సౌష్టంగా తయారీచేస్తారు. ఇనుము గట్టిగా ఉండడంతో పాటు బాగా పదునుగా మారుతుంది. ఇరుడు కర్ర వినియోగించడం వల్ల రైతుల చేతికి ఎటువంటి దెబ్బలు తగలకపోగా పట్టుకునేందుకు అనువుగా ఉంటుంది.   

మరిన్ని వార్తలు