ధరల పెరుగుదల స్వల్పమే

23 Jul, 2019 11:14 IST|Sakshi

భూముల రిజిస్ట్రేషన్‌ ధరల పెంపుపై ఫిర్యాదుల స్వీకరణ

ఆగస్టు ఒకటో తేదీ నుంచి పెరిగిన ధరల అమలు

భూముల రిజిస్ట్రేషన్‌ ధరల పెంపునకు సంబంధించి ప్రజలపై భారం పడకుండా, ప్రభుత్వానికి నష్టం రాకుండా ఆ శాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రతి ఏడాదీ ఆగస్టులో రిజిస్ట్రేషన్‌ ధరలు పెరగడం సహజం. అందులో భాగంగా ఈ ఏడాది కూడా భూముల రిజిస్ట్రేషన్‌ ధరలు స్వల్పంగా పెరగనున్నాయి. పెంచే ధరలలో కూడా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారుల నుంచి అనుమతులు కూడా వచ్చాయి. రిజిస్ట్రేషన్‌ శాఖల  వారిగా పరిస్థితిని ఆ శాఖ అధికారులు సమీక్షిస్తున్నారు.

సాక్షి, నెల్లూరు: రిజిస్ట్రేషన్‌ శాఖ నిబంధనల ప్రకారం ప్రతి ఏడాదీ ఆగస్టు ఒకటో తేదీన రిజిస్ట్రేషన్‌కు సంబంధించి భూముల విలువలు పెంచుతారు. రిజిస్ట్రేషన్‌ శాఖ ఉన్నతాధికారుల నిర్ణయంతో ఈ ధరల పెంపు ఉంటుంది. అందులో భాగంగా ఈ ఏడాది కూడా ఆగస్టు ఒకటో తేదీ నుంచి రిజిస్ట్రేషన్‌ ధరలు పెరగనున్నాయి. ప్రధానంగా రిజిస్ట్రేషన్‌ ధరలు పెంచే ముందు ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంటారు. అదే విధంగా ఈ నెల 26వ తేదీ వరకు పెంచుతున్న ధరలపై వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు స్వీకరించనున్నారు. ఎవరైనా ధరల పెంపుదలపై సూచనలు, సలహాలు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలోని పలు చోట్ల ధరల పెంపుదలకు ముందే భూముల రిజిస్ట్రేషన్లు పలువురు చేయించుకుంటున్నారు.

ప్రణాళిక సిద్ధం
నెల్లూరును రిజిస్ట్రేషన్‌ పరంగా రెండు జిల్లాలుగా పిలుస్తారు. గూడూరు జిల్లా కింద 10 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. నెల్లూరు జిల్లా కింద తొమ్మిది సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. మొత్తం 19 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. వీటిలో ఎక్కువగా నెల్లూరు, స్టౌన్‌హౌస్‌పేట, కావలి, సర్వేపల్లి, నాయుడుపేట, సూళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాళెం తదితర ప్రాంతాల్లో ఎక్కువగా రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా ప్రభుత్వానికి రాబడి వస్తోంది.

కాగా ప్రతి ఏటా పెంచే ధరలలో భాగంగా ఈ ఏడాది కూడా 10 శాతం భూములు విలువలు పెంచుతున్నట్లు, దాని ద్వారా రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి జిల్లా ఉన్నతాధికారుల నుంచి కూడా అనుమతులను ఇటీవలే తీసుకున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలను సబ్‌రిజిస్ట్రార్‌లతో ఆ శాఖ జిల్లా ఉన్నతాధికారులు ధరల పెంపుదలపై చర్చిస్తున్నారు. ఏయే ప్రాంతంలో ఎక్కువగా ఉంటుందో,  ప్రజలకు ఎక్కడా భారం కాకుండా, నష్టం లేకుండా చేసే విధంగా  చూడాలని ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ చేస్తున్నారు.

ఆగస్టు ఒకటి నుంచి అమలు చేస్తున్నాం
జిల్లాలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి భూమల విలువ పెంచుతున్నాం. అందుకు తగ్గట్లు ప్రణాళికను రూపొందించాం. జిల్లా ఉన్నతాధికారుల నుంచి కూడా అనుమతులు తీసుకున్నాం. ధరల పెంపుదలపై ఈ నెల 26వ తేదీ లోపు ఎవరైనా సలహాలు,  సూచనలు ఇవ్వొచ్చు. పెంచిన ధరలను అన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు పంపిస్తున్నాం.
– మునిశంకరయ్య, జిల్లా రిజిస్ట్రార్‌

మరిన్ని వార్తలు