ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులయ్యేలా చూడాలి

16 Jan, 2014 05:16 IST|Sakshi

 కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన ప్రసూతి సౌకర్యాలు కల్పించడంతో పాటు గర్భిణుల నమోదుతో పాటు రెండవ, నాల్గవ వైద్య పరీక్షలు నిర్వహించడంలో జిల్లా రాష్ట్రంలోనే మొద టి స్థానంలో నిలిచిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి కలెక్టర్ స్మితా సబర్వాల్‌ను అభినందించారు. బుధవారం హైదరాబాద్ నుంచి వైద్య ఆరోగ్యంపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మార్పు కార్యక్రమం ద్వారా క్లస్టర్ పరిధిలో స్వయం సహాయక సభ్యులు, అంగన్‌వాడీ, ఆర్‌డబ్ల్యూఎస్, ఐకేపీ, ఐసీడీఎస్ వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో సమావేశాలు నిర్వహించడంతో పాటు గర్భిణుల నమోదు, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హైరిస్క్ ప్రసవాలను ముందే గుర్తించి గర్భిణుల పట్ల అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.

సిద్దిపేట సీహెచ్‌సీలో ప్రత్యేకంగా డెడికేటెడ్ హై రిస్క్ కేంద్రం ఏర్పాటు చేసి సుఖై ప్రసవాలు జరిగేలా వైద్య సదుపాయాలు, స్త్రీ వైద్య నిపుణులను అందుబాటులో ఉంచేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ నెల 24న ప్రారంభించే కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి, కమిషనర్లను కలెక్టర్ ఆహ్వానించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవడంలో భాగంగా 46 మంది స్టాఫ్ నర్సులను నియమించామన్నారు. గతేడాది అక్టోబర్ వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకు 1600 ప్రసవాలు జరగగా నవంబర్ నాటికి 2000 వేలకు పైగా నమోదవుతున్నాయన్నారు. పుట్టిన పిల్లలకు టీకాలు వేయడంలో ప్రత్యేక చొరవ చూపి మెరుగు పర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.

 19న పల్స్ పోలియో
 పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో 0 నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు 100 శాతం పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి డీఎంహెచ్‌ఓ డాక్టర్ పద్మ, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ వీణాకుమారి, ఎన్‌ఆర్‌హెచ్‌ఎం పి.జగనాథ్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీపీ రాజేశ్వర్‌రెడ్డి, ఐసీడీఎస్ పీడీ శైలజ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు