కబ్జాదారులకు కలతనిద్రే!

17 Feb, 2014 03:56 IST|Sakshi

కంచె లేని స్థలం కన్పిస్తే.. తెల్లారేసరికి ఎవరో ఒకరు హద్దులు పాతుతారు.. హద్దులున్నా.. కూల్చేసి ఆక్రమిస్తారు.. వీరికి అండగా కంటిచూపుతో అవతలి పార్టీని బెదిరిస్తారు ఇంకొందరు.. రాజకీయ జోక్యంతో సమస్య ముదురుపాకాన పడుతుంది. ఈ క్రమంలో దాడులు.. ప్రతిదాడులు.. ఇదీ భూ కబ్జాల్లో కన్పించే వరుస. కొందరు పనిగట్టుకుని సమస్యను జఠిలం చేస్తుంటారు. పోలీసులు కల్పించుకుంటే ‘సివిల్ తగదా’ అంటారు. ఓ రకంగా చెప్పాలంటే భూకబ్జాదారులకు అడ్డూఅదుపూ కరువైంది. ఇలాంటి మదపుటేనుగులను అదుపు చేసేందుకు పోలీసులు ఓ అంకుశానికి పదును పెడుతున్నారు. అదే హిస్టరీషీట్.
 
 కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్: కేసు నమోదు, రౌడీషీట్ తెరవడం.. మనం వీటినే విన్నాం. కానీ పోలీసు యంత్రాంగం కొత్తగా ‘హిస్టరీషీట్’పై దృష్టిసారిస్తున్నట్లు తెలిసింది. భూ కబ్జాదారులు(ల్యాండ్‌గ్రాబర్లు)పై దీన్ని ప్రయోగిస్తారు. హైదరాబాద్‌లో విజయవంతమైన ఈ విధానాన్ని జిల్లాలోనూ పకడ్బందీగా అమలు చేసేందు కు ఏర్పాట్లు చేస్తున్నారు. సందర్భాన్ని బట్టి భూ సంబంధ లావాదేవిల్లో పోలీసులు అనుసరించాల్సిన ప్రత్యేక ప్రామాణిక కార్యచరణ, నిబంధనలపై డీజీపీ ప్రసాద్‌రావు ఆదేశాలు జారీ చేశారు.
 

మరిన్ని వార్తలు