సచివాలయ ఉద్యోగులకు రోజూ క్షేత్రస్థాయి పర్యటనలు 

9 Feb, 2020 03:30 IST|Sakshi

జాబ్‌ చార్ట్‌లు సిద్ధం చేసిన ప్రభుత్వం

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ప్రతి రోజూ ఉదయమే క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు అందుతున్న పౌర సేవలను స్వయంగా పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వీరు కార్యాలయ పనివేళలకు ముందుగానే తెల్లవారుజామున 5.30 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు తమ పరిధిలో పర్యటించి ప్రజలను కలుసుకోవాల్సి ఉంటుంది. నవరత్నాలతో పాటు ఇతర సేవలన్నీ వలంటీర్ల ద్వారా ప్రజల ముంగిటకే అందించే లక్ష్యంలో భాగంగా సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం జాబ్‌ చార్ట్‌లను కూడా రూపొందించింది.  

జాబ్‌ చార్ట్‌ ఇలా... 
- క్షేత్రస్థాయి పర్యటనలో ప్రధానంగా పారిశుధ్య పనులు, పారిశుధ్య కార్మికుల హాజరు, పనితీరును పరిశీలించాలి.  
మంచినీటి సరఫరా, వీధిలైట్ల పనితీరు, స్పందనలో అందిన వినతులు, ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి.  
క్షేత్రస్థాయి పర్యటనలో గుర్తించిన సమస్యలపై మధ్యాహ్నం నుంచి చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.  
ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణ వివరాలతో పాటు వలంటీర్ల పనితీరు గురించి తెలుసుకోవాలి.  
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు ఉద్యోగులు సచివాలయ కార్యాలయాల్లో తప్పనిసరిగా ఉండాలి.  
ఉద్యోగులు రోజువారీ డైరీని నిర్వహించాలి.
ఉద్యోగులంతా పంచాయతీ సమావేశాలు, గ్రామ సభలకు హాజరవ్వాలి. అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో భాగస్వాములు కావాలి.  
నవరత్నాలతోపాటు ఇతర సేవలను ప్రజల ముంగిటకు సమర్థంగా, సకాలంలో చేర్చడంపై గ్రామ సచివాలయం దృష్టి సారించాలి.  
- నవరత్నాలకు సంబంధించి ప్రజలకు ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి.  
- ప్రతి రోజూ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు అభ్యర్థనలను నిర్దిష్ట సమయంలోగా పరిష్కరించాలి.  
ప్రభుత్వ, గ్రామ పంచాయతీ ఆస్తులను పరిరక్షించాలి.  
1956 కల్తీ ఆహార నిరోధక చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి.  
తూనికలు, కొలతల్లో అక్రమాలను నిరోధించడం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన,  బాల్య వివాహాల నివారణ, దశలవారీగా మద్యనిషేధం, గృహ హింస చట్టం అమలుకు కృషి చేయాలి. 
వివిధ పథకాల లబ్ధిదారుల గుర్తింపు, పంపిణీపై సమీక్షించాలి.  
లే అవుట్లు, తాగునీటి కనెక్షన్లు, వ్యాపార లైసెన్సుల కోసం అందిన దరఖాస్తులను తనిఖీ చేయాలి.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా