పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ ఉచితం

2 Sep, 2015 03:40 IST|Sakshi

- 100 గజాల్లోపు ఉంటేనే అవకాశం
- తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి
- కుటుంబానికి ఒక ఇంటికే చాన్స్
- మేయర్ కోనేరు శ్రీధర్
విజయవాడ సెంట్రల్ :
వంద గజాల లోపు ఉన్న పేదల గృహాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలని మేయర్ కోనేరు శ్రీధర్ టౌన్‌ప్లానింగ్ అధికారుల్ని ఆదేశించారు. మంగళవారం తన చాంబర్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవో నంబర్ 296 ప్రకారం ప్రభుత్వ స్థలంలో పేదలు వంద గజాల లోపు ఆక్రమించి నిర్మించుకున్న ఇళ్లను ఉచితంగా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
 
ఈ మేరకు చర్యలు చేపట్టాల్సిందిగా సూచించారు. విధి విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అసిస్టెంట్ సిటీ ప్లానర్ వి.సునీత మాట్లాడుతూ 2014 జనవరి ఒకటో తేదీలోపు నిర్మించిన గృహాలను మాత్రమే క్రమబద్ధీకరించనున్నట్లు చెప్పారు.

ఆగస్ట్ 15 నుంచి 120 రోజుల్లోపు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆక్రమణదారుడు తప్పనిసరిగా తెల్లరేషన్ కార్డు కలిగి ఉండాలన్నారు. కుటుంబానికి ఒక్క ఇల్లు మాత్రమే క్రమబద్ధీకరించనున్నట్లు చెప్పారు. మాస్టర్ ప్లాన్, జోనల్ డెవలప్‌మెంట్ ప్లాన్, రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్, నదీ పరీవాహక ప్రాంతాలు, ప్రజల ప్రయోజనం కోసం కేటాయించిన స్థలాలు, ఫుట్‌పాత్‌ల మీద ఉన్న ఆక్రమణల్ని రెగ్యులరైజ్ చేయబోమని తెలిపారు. దరఖాస్తుతో పాటు ఆధార్ జిరాక్స్‌ను తప్పనిసరిగా జతచేయాలన్నారు. పూర్తి వివరాల కోసం టౌన్‌ప్లానింగ్‌లో సంప్రదించాలని సూచించారు. టీడీపీ ఫ్లోర్‌లీడర్ జి.హరిబాబు, సిటీప్లానర్ ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు