గజరాజులకు పునరావాసం

2 Sep, 2019 04:30 IST|Sakshi
విజయనగరం జిల్లాలో సంచరిస్తున్న ఏనుగులు

‘జంతికొండ’లో ఏర్పాటుకు నిర్ణయం

526 హెక్టార్లల్లో ఆహారం, తాగునీటికి ఏర్పాట్లు

ప్రస్తుతం శ్రీకాకుళం ,విజయనగరం జిల్లాల్లో 10 ఏనుగులు

అభయారణ్యాలపైనా ప్రత్యేక దృష్టి

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్ర సరిహద్దుల్లో ఏనుగుల సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. విజయనగరం జిల్లాలో ఆ మేరకు అవసరమైన స్థలాలను అధికారులు అన్వేషిస్తున్నారు. 1,315 ఎకరాల్లో ఎలిఫెంట్‌ శాంక్చ్యురీని పెట్టి రెండు జిల్లాల్లో సంచరిస్తున్న 10 ఏనుగులకు ఆవాసం కల్పించాలని భావిస్తున్నారు. గజరాజుల సంరక్షణతోపాటు, వాటి దాడినుంచి ప్రజలు, పంటలను రక్షించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎలిఫెంట్‌ జోన్లు ఏర్పాటుచేసి ఏనుగులకు అవసరమైన ఆహారం, తాగునీటి సౌకర్యాలు కల్పించాలనే ప్రతిపాదనలు చాలా కాలంగా ఉన్నాయి. అయితే అడవినే నమ్ముకుని బతుకుతున్న గిరిజనులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. గిరిజనుల భయాందోళనలను దృష్టిలో పెట్టుకుని శాశ్వత ప్రాతిపదికన ఎలిఫెంట్‌ జోన్‌ ఏర్పాటు చేసే అంశాన్ని పక్కనపెట్టి ఏనుగుల పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాలూరు అటవీ రేంజ్‌ పరిధిలోని జంతికొండ ప్రాంతాన్ని దీనికోసం ఎంపిక చేశారు.

సరిహద్దులో ఏనుగులు–ఆందోళనలో ప్రజలు
ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో ఏనుగులు ఏడాది కాలంగా తిష్టవేశాయి. విజయనగరం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, జియ్మమ్మవలస, కురుపాం, సాలూరు గిరిజన ప్రాంతాల్లోకి గతేడాది సెప్టెంబర్‌ 7వ తేదీన ప్రవేశించాయి. కొండ చరియల ప్రాంతంలో నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పటికీ గిరిజనులు ఎంతో కష్టపడి పంటలను సాగుచేస్తున్నారు. ఆ సమయంలో ఏనుగులు దాడిచేయగా 1,368 ఎకరాల్లో వరి, చెరకు, అరటి, టమాట పంటలు దెబ్బతిన్నాయి. 1,138 మంది రైతులు రూ.89.50 లక్షల పంటను నష్టపోయారు. ఇద్దరు చనిపోయారు. రెండు ఏనుగులు కూడా చనిపోయాయి. 2007 సంవత్సరంలో  కూడా ఏనుగులు జిల్లాలో ప్రవేశించి ఆస్తి, ప్రాణనష్టం కలిగించాయి. అప్పట్లో జియ్యమ్మవలస మండలానికి చెందిన ముగ్గురిని పొట్టన పెట్టుకున్నాయి. ఒక ఏనుగును చంపేశారు. ఏనుగుల సంచారంతో విజయనగరం జిల్లాతో పాటు శ్రీకాకుళం జిల్లా, ఒడిశా రాష్ట్ర ప్రజలు కూడా భయంతో బతుకుతున్నారు. గతంతో ఏనుగులు విరుచుకుపడినప్పుడు ఆపరేషన్‌ జయంతి, అపరేషన్‌ గజ పేరుతో నాలుగు ఏనుగులను బంధించి ఒడిశా రాష్ట్రంలోని లఖేరీ అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. అందులో ఒక ఏనుగు మరణించడంతో జంతు సంరక్షణ కమిటీ అభ్యంతరం తెలిపింది. దాంతో ఆ ఆపరేషన్‌ ఆగిపోయింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పునరావాస కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.

వన్యప్రాణుల సంరక్షణకు కూడా...
రాష్ట్రంలో మొత్తం 13 అభయారణ్యాలు ఉన్నాయి. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్ట్‌ ఏరియాలో పులుల అభయారణ్యం ఉంది. వాటిలో 55 వరకూ పులులు ఉన్నాయి. 40 ఏళ్ల క్రితం శేషాచలం అడవులు...అంటే తిరుపతి దిగువన ఉన్న ప్రాంతాల్లో పులులు ఉండేవి. ఈ ఏడాది మార్చిలో అక్కడ పులుల జాడ కనిపించింది. రానున్న మూడేళ్లలో వన్యప్రాణుల కోసం నీటి కుంటలు, చెరువులు సైంటిఫిక్‌గా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. వన్యప్రాణులు నీరు, ఆహారం కోసం అడవులు దాటి, ప్రజల ఆవాసాలపైకి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రతి 5 చదరపు కిలోమీటర్లకు చెరువులు/కుంటలు ఏర్పాటు చేయనున్నారు. ఏడాదంతా నీరు ఉండేందుకు సోలార్‌ పంప్‌ సెట్‌లను కూడా ఏర్పాటు చేస్తారు.

త్వరలోనే పునరావాసం
ఏనుగుల పునరావాస కేంద్రాన్ని 1,315 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ ప్రాంతం చుట్టూ ఏనుగుల సంచారానికి, నివాసానికి అనుకూల పరిస్థితులు కల్పిస్తాం. అవి బయటకు రాకుండా తగిన రక్షణ ఏర్పాట్లు చేస్తాం. ఆహారం, నీటి సౌకర్యాలు అందుబాటులో ఉంచుతాం. 
–లక్ష్మణ్, డీఎఫ్‌ఓ (టెరిటోరియల్‌), విజయనగరం.

>
మరిన్ని వార్తలు