రిహార్సల్‌ పక్కా!

3 Aug, 2018 13:05 IST|Sakshi
సీఎం సభలో ఏం మాట్లాడాలో శిక్షణ పొందుతున్న సాధికారమిత్రలు

తాతకుంట్ల గ్రామదర్శినికి అధికారుల పాట్లు

ప్రభుత్వ వ్యతిరేక గళం వినిపించకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు

అన్ని ప్రభుత్వ పథకాలు అనుయాయులకే

తాతకుంట్ల గ్రామదర్శిని  కార్యక్రమ కథాకమామిషు ఇదీ

తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం తాతకుంట్లలో శుక్రవారం సీఎం చంద్రబాబు నిర్వహించనున్న గ్రామదర్శినికి అధికారులు రిహార్సల్‌ పక్కాగా చేశారు. ఎవరు మాట్లాడాలి...ఏం మాట్లాడాలి... అనే విషయాలపై కూడా ముందుగానే శిక్షణ ఇచ్చారు. గ్రామంలో ఏ ఒక్కరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రభుత్వ పనితీరు బ్రహ్మాండం.. పథకాలు ఆహో ఓహో అని చెప్పే విధంగా వందిమాగదులకు తర్ఫీదునిచ్చారు.

సాక్షి, అమరావతిబ్యూరో : ‘సీఎం గారూ నమస్కారం...అయ్యా మేము సాధికార మిత్రులం.. గ్రామంలో ఇంటింటా తిరిగి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్నాం... అర్హులైన వారందరికీ లబ్ధి చేకూరేలా చూస్తున్నాం... ప్రతి మహిళ చేతి వృత్తుల ద్వారా కుటుంబ పోషణ గడిచేలా తర్ఫీదు ఇస్తున్నాం’..అంటూ విస్సన్నపేట మండలం తాతకుంట్లలో శుక్రవారం నిర్వహించే గ్రామదర్శిని సభలో ప్రసంగించాలని సాధికార మిత్రలతో అధికారులు ముందుగానే రిహార్సల్స్‌ చేయించారు. ఒక్కో సాధికార మిత్రకు 35 కుటుంబాలను అప్పగించి పక్కా ఇళ్లు, పింఛన్లు, దీపం పథకం, మరుగుదొడ్ల నిర్మాణం, ఉపకార వేతనాలు, ఇతర ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా.? ఇతరత్రా సమస్యల వివరాలను గురువారం సాయంత్రం వరకు సేకరించి అధికారులకు నివేదిక అందించారు.

నెలరోజులుగా హడావుడి...
జిల్లాలోని కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరుకాబోతున్నారు. నెల రోజుల కిందట గ్రామదర్శిని  ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో హడావుడి మొదలైంది. జిల్లా యంత్రాంగం మొత్తం ఆ గ్రామంపై దృష్టి సారించింది. ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు అందుతున్నాయా? ఇప్పటిదాకా ఎంతమందికి అందాయి? ఇంకా ఎంత మందికి అందాల్సి ఉంది? మౌలిక సదుపాయాల కల్పన మాటేమిటి? అన్న అంశాలపై సమగ్ర నివేదికను తెప్పించుకున్నారు. ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలకు ఈ పథకాలు పక్కాగా అమలయ్యాయా లేదా అన్న వివరాలను సేకరించడంతోపాటు కొత్తగా కొంత మంది జాబితాను సిద్ధం చేశారు. ఒకవేళ గ్రామదర్శినిలో ముఖ్యమంత్రి ప్రజలను అడిగినా పథకాలు భేష్‌గా అమలవుతున్నాయనేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.

వ్యతిరేక గళం వినిపించకూడదు...
ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా ఏ ఒక్కరూ గ్రామదర్శిని కార్యక్రమంలో వ్యవహరించరాదని జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో అధికారపార్టీకివ్యతిరేకంగా మాట్లాడేవారెవరు ఉన్నారని గుర్తించి వారిని శుక్రవారం రోజు వీలైతే మరో ప్రాంతానికి తరలించే ఏర్పాట్లను చేయడానికి సైతం అధికారులు సిద్ధమయ్యారు. ముఖ్యం గా తాతకుంట్ల తండావాసులను, వైఎస్సార్‌ సీపీ  కార్యకర్తలు, అభిమానులను గ్రామదర్శిని కార్యక్రమ పరిసరాలకు కూడా రానివ్వరాదన్న నిబంధనపై గ్రామస్థులు మండిపడుతున్నారు. జేజేలు కొట్టేవారికే అక్కడ పెద్దపీట వేయడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాగైతే తమ సమస్యల గోడు ప్రభుత్వానికి తెలిసేదేలా అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా