‘మీ’–సేవ అర్జీలు బుట్టదాఖలు

2 Apr, 2018 04:17 IST|Sakshi

ఏడాది వ్యవధిలో 10 లక్షల దరఖాస్తులు తిరస్కరణ.. కుంటి సాకులతో పక్కన పడేస్తున్న అధికారులు 

డబ్బు, సమయం వృథా అవుతున్నాయని జనం అసంతృప్తి.. అధికారులకు ముడుపులిస్తేనే అందుతున్న ధ్రువపత్రాలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోందని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ‘మీ–సేవ’ తిరస్కరణ సేవగా మారింది. నిర్దిష్ట రుసుం, సర్వీస్‌ చార్జీ చెల్లించి మీ–సేవలో సమర్పించిన దరఖాస్తులను రకరకాల కుంటిసాకులతో అధికారులు తిరస్కరించి చెత్తబుట్టలో పడేస్తున్నారు. ఇలాగైతే అర్జీలు స్వీకరించడం ఎందుకని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ రికార్డుల అప్‌డేట్‌(మ్యుటేషన్‌),  మైగ్రేషన్‌ సర్టిఫికేట్‌(వలస ధ్రువీకరణ), డూప్లికేట్‌ మార్కుల జాబితా, కొత్త ఇల్లు నిర్మాణం/ఉన్న ఇంట్లో అదనపు గదుల నిర్మాణానికి అనుమతి, రెవెన్యూ రికార్డుల్లో అదనపు సర్వే నంబరు చేర్పు తదితర సేవల కోసం మీ–సేవ ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటును గత ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. 

నీరుగారుతున్న లక్ష్యం 
లంచాలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా సర్టిఫికేట్లు జారీ చేయడమే మీ–సేవ కేంద్రాల ఏర్పాటు లక్ష్యమని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. అధికారుల అలసత్వంతో ఈ లక్ష్యం నీరుగారిపోతోంది. ‘‘సర్టిఫికేట్ల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన, ముడుపులు సమర్పించాల్సిన అవసరం ఉండదు. మీ–సేవ కేంద్రంలో దరఖాస్తు చేస్తే చాలు సర్టిఫికేట్‌ ఇంటికే వస్తుంది. దీనివల్ల ప్రజలకు సమయం, డబ్బు ఆదా అవుతాయి’’ అని ప్రభుత్వం చెబుతున్నా.. వాస్తవం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. మీ–సేవలో దరఖాస్తు చేసినప్పటికీ ధ్రువపత్రం రావాలంటే సంబంధిత అధికారులను కలిసి ముడుపులు ముట్టజెప్పాల్సిందే. లేకపోతే ఏదో ఒక సాకుతో దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. 2017 మార్చి 1 నుంచి 2018 మార్చి 1వ తేదీ వరకూ కేవలం ఏడాది వ్యవధిలో 10.25 లక్షల అర్జీలను చెత్తబుట్టలో పడేయడం గమనార్హం. మీ–సేవ ద్వారా రుసుం చెల్లించి ఏడాది కాలంలో మొత్తం 70.30 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 57.36 లక్షల అర్జీలను అధికారులు ఆమోదించారు. మరో 10.25 లక్షల దరఖాస్తులను తిరస్కరించారు. ఇంకా 2.64 లక్షల అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి.

డబ్బు, సమయం వృథా 
కరువు వల్ల అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు, శ్రీకాకుళం తదితర జిల్లాల నుంచి చాలామంది పొట్ట చేతపట్టుకుని కూలీ పనులకోసం వలస వెళుతున్నారు. వీరు వలస ధ్రువీకరణ పత్రాలకోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. రూ.635 చెల్లించి దరఖాస్తు చేసినప్పటికీ అధికారులు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. వలస వెళ్లినట్లు సర్టిఫికేట్‌ ఇస్తే వారికి పని చూపలేదంటూ ప్రజాప్రతినిధుల నుంచి మాట పడాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనే వలస ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని సమాచారం. దరఖాస్తులను అధికారులు తిరస్కరిస్తుండడంతో డబ్బు, సమయం వృథా అవుతున్నాయని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది అర్జీలు తిరస్కరణకు గురవుతున్నట్లు తెలిసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సర్వే, మ్యుటేషన్‌ దరఖాస్తులను రెవెన్యూ సిబ్బంది తిరస్కరించి పక్కన పడేస్తున్నారని, సమస్యలు ఏళ్ల తరబడి అలాగే ఉండిపోతున్నాయని రెవెన్యూ శాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఇటీవల జరిగిన జాయింట్‌ కలెక్టర్ల సమావేశంలో ప్రకటించారు. 

డబ్బులిస్తేనే ఎన్‌ఓసీ వచ్చింది 
‘‘విశాఖపట్నంలోని నా ఇంటికి అదనపు నిర్మాణానికి గాను నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ) కోసం నిర్ధిష్ట రుసుం చెల్లించి మీ–సేవలో దరఖాస్తు చేశా. సంబంధిత అధికారిని కలవకపోతే దరఖాస్తును తిరస్కరిస్తారని వేరేవారు చెప్పడంతో వెళ్లి కొంత డబ్బు ముట్టజెప్పా. వెంటనే ఎన్‌ఓసీ వచ్చింది. నాతోపాటు దరఖాస్తు చేసిన నా మిత్రుడు సంబంధిత అధికారిని కలవకపోవడంతో అతడి అర్జీ తిరస్కరణ జాబితాలో చేరింది’’ 
– ప్రసాదరాజు, ఎంవీపీ కాలనీ, విశాఖపట్నం 

మరిన్ని వార్తలు