-

అమెరికా, ఏపీ మధ్య సంబంధాలు మరింత బలోపేతం

31 Aug, 2019 04:51 IST|Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆకాంక్ష

హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం   

సాక్షి, అమరావతి: అమెరికాతో ఏపీ సంబంధాలు మరింతగా బలోపేతం కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయం నెలకొల్పి పదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందిస్తున్నట్టుగా తెలిపే వీడియో సందేశాన్ని హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ అధికారులు విడుదల చేశారు. ఇందులో వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ... ‘‘నాకు బాగా గుర్తు. పదేళక్రితం నాన్నగారు సీఎంగా ఉండగా హైదరాబాద్‌కు అమెరికా కాన్సులేట్‌ కార్యాలయాన్ని తీసుకువచ్చారు.

ఈ పదేళ్లలో ఈ కాన్సులేట్‌ కార్యాలయం తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో సేవ చేసింది. ప్రపంచం వేగంగా మారుతోంది. భారతదేశానికి అమెరికా అన్ని విధాలుగా సహకరిస్తోంది. అమెరికా, భారత్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావాలి. అమెరికాతో కలసి పని చేయడం ఏపీకి ఎంతో ప్రయోజనకరం. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశం అమెరికా. ఏపీలో సాఫ్ట్‌వేర్‌ నిపుణులు మెరుగైన ఉద్యోగాలకోసం అమెరికా వైపు చూస్తున్నారు. మున్ముందు కూడా అమెరికా, ఏపీల మధ్య సన్నిహిత సంబంధాలు మరింతగా బలపడతాయని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు