రమ్యశ్రీ కడసారి చూపు కోసం..

25 Sep, 2019 13:20 IST|Sakshi
రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతదేహాల కోసం ఎదురుచూస్తూ రోదిస్తున్న బంధువులు

కన్నతండ్రి ఎదురు చూపులు నేడు కోటిలింగాలఘాట్‌లో రమ్యశ్రీ కర్మకాండ మరో రెండు మృతదేహాలు లభ్యం మృతుల వస్తువులైనా అప్పగించాలని వేడుకోలు

తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: కన్న కూతురి కడసారి చూపు కోసం కన్న తండ్రి పది రోజులుగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలకు చెందిన కాకునూరి రమ్యశ్రీ(24) కచ్చులూరు బోటు ప్రమాదంలో గల్లంతైంది. ఆ యువతి జాడ కోసం కన్న తండ్రి సుదర్శన్‌ పది రోజులుగా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో నిరీక్షిస్తున్నాడు. తొలిరోజు 50 మంది కుటుంబ సభ్యులతో వచ్చిన ఆయన పది రోజులుగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు 16 మంది రాజమహేంద్రవరంలో మకాం వేసి ఆమె ఆచూకీ కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఆశగా ఎదురుచూస్తున్నారు.

మంగళవారం ఒక మృతదేహం వాడపల్లి వద్ద, రెండో మృతదేహం సీతానగరం మండలం ఇనుగంటివారిపేట లంకభూమి వద్ద గుర్తించారు. అయితే వాడపల్లి వద్దకు మృతుల బంధువులను బస్సులో తీసుకువెళ్లేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. తీరా ఆ మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడంతో బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉండిపోయారు. మృతదేహం మార్చురీకి తీసుకురాగా, దాని గుర్తింపు కోసం అక్కడికి బంధువులను తీసుకువచ్చారు. ఆ మృతదేహం మంచిర్యాలకు చెందిన రమ్యశ్రీదిగా భావించారు. రమ్యశ్రీ తండ్రి, బంధువులు మార్చురీకి వద్ద మృతదేహంపై ఉన్న పచ్చబొట్టు, ఇతర వస్తువులు ఉన్నాయేమోనని చూసుకున్నారు. ఆ మృతదేహంపై పూర్తిగా మట్టిపేరుకుపోయి, దుస్తులు లేకపోవడం, పూర్తిగా ఎముకల గూడులా ఉండడంతో మట్టిని శుభ్రం చేసి చూసిన తరువాత ఆ మృతదేహం పురుషుడిదని గుర్తించారు. కానీ మృతుడు ఆచూకీ లభించకపోవడంతో డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని మృతుల బంధువులు కోరారు.

నేడు రమ్యశ్రీ కర్మకాండ నిర్వహణకు ఏర్పాట్లు
రమ్యశ్రీ మృతదేహం కోసం పది రోజులుగా నిరీక్షించిన మృతురాలి తండ్రి సుదర్శన్, తల్లి భూలక్ష్మి, ఇతర బంధువులు మంగళవారం వరకు చూసి మృతదేహం లభిస్తే బుధవారం తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలని, లేకుంటే వెళ్లిపోయి 11వరోజు కర్మకాండ నిర్వహించాలని అనుకున్నారు. మంగళవారం మ«ధ్యాహ్నం చానళ్లలో మహిళ మృతదేహం లభ్యమైనట్టు స్క్రోలింగ్‌లు రావడంతో చూసి రాజమహేంద్రవరంలోనే ఆగిపోయారు. మృతదేహం పరిశీలించిన అనంతరం మహిళ మృతదేహం కాకపోవడంతో 11వ రోజు బుధవారం రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్‌లో కర్మకాండ ఏర్పాట్లలో ఉన్నారు. ఏరోజు చేయాలా అనేది తర్జనభర్జన పడుతున్నారు. పదకొండో రోజు కర్మకాండ నిర్వహించి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు రమ్యశ్రీ మేనమామ వెంకటేష్‌ చెప్పారు.

గుర్తుపట్టలేని విధంగా..
హైదరాబాద్‌ రామాంతపూర్‌కు చెందిన అంకం పవన్‌ కుమార్, అతడి భార్య వసుంధర భవానీ మృతదేహాల కోసం మేనమామ మట్టా రాజేంద్ర ప్రసాద్‌ పది రోజులుగా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎదురు చూస్తున్నాడు. మంగళవారం మృతదేహం లభించంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం గుర్తు పట్టేందుకు వీలు లేకపోవడంతో డీఎన్‌ఏ నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ 10 రోజులుగా నీటిలో ఉండిపోయిన మృతదేహాలు గుర్తు పట్టేందుకు వీలు లేకుండా పోతున్నాయని, దొరికిన వాటికి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని కోరారు.

ఇనుగంటివారిపేట వద్ద మరో మృతదేహం
సీతానగరం (రాజానగరం): కచ్చులూరు వద్ద జరిగిన లాంచీ ప్రమాదంలో మృతి చెందిన ఓ మహిళ మృతదేహాన్ని మంగళవారం ఇనుగంటివారిపేట లంకభూమికి అవతల వైపున పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం ఎదురుగా లంకభూమి వద్ద గుర్తించారు. తాళ్లపూడి ఎస్సై సతీష్‌ తన సిబ్బందితో లంకభూమి వద్ద ఉన్న మృతదేహం వద్దకు సాయంత్రం ఆరు గంటలకు చేరుకున్నారు. అయితే రాత్రి అయినందున వెనక్కి తరలివెళ్లారు. బుధవారం మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తామని ఎస్సై సతీష్‌ వెల్లడించారు.

ఇప్పటి వరకూ లభించిన మృతదేహాలు 38
దేవీపట్నం మండలం కచ్చులూరులో ప్రైవేటు టూరిజం బోటు ప్రమాదంలో మంగళవారం వరకు 38 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 13 లభించాల్సి ఉందని రెవెన్యూ అధికారులు తెలిపారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో గుర్తించ లేని మూడు మృతదేహాలు ఉన్నాయి.

బోటు ప్రమాదంపై ప్రాథమిక విచారణ ప్రారంభం
కాకినాడ సిటీ: దేవీపట్నం దగ్గర జరిగిన బోటు ప్రమాద సంఘటనపై ప్రాథమిక విచారణ ప్రారంభించామని జాయింట్‌ కలెక్టర్, మెజిస్ట్రీయల్‌ ఎంక్వైరీ అధికారి జి లక్ష్మీశ తెలిపారు. మంగళవారం విచారణాధికారిగా తొలిసారి జాయింట్‌ కలెక్టర్‌ తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో విచారణ చేపట్టారు. విచారణలో జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ, పోర్టు డైరెక్టర్‌ ధర్మపాస్థ, అడిషనల్‌ ఎస్పీ వి.జిందాల్, రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌ మహేష్‌కుమార్, ఇరిగేషన్‌ ఎస్‌ఈ ఎన్‌.కృష్ణ, ఫిషరీస్‌ జేడీ పి.జయరాజు, బోటు సూపరింటెండెంట్‌ కె.దొరయ్య, టూరిజం డివిజనల్‌ మేనేజర్‌ ప్రకాశ్‌తో పాటు రంపచోడవరం ఆర్డీవో కార్యాలయపు డీఈవో, దేవీపట్నం తహసీల్దార్, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌లను తమ, తమ పరిధిలో జరిగిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. తదుపరి విచారణ త్వరలో సంబంధిత అధికారులతో చేపట్టనున్నట్టు లక్ష్మీశ తెలిపారు. బోటు ప్రమాదానికి సంబంధించి ఎవరైనా వ్యక్తిగతం, లిఖిత పూర్వకంగా తనను సంప్రదించవచ్చని లక్ష్మీశ తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా