-

కన్నీటికే కన్నీరు!

29 Jul, 2017 07:05 IST|Sakshi
కన్నీటికే కన్నీరు!

∙చావు బతుకుల మధ్య ఉన్నరోగిని ఆస్పత్రికి చేర్చలేని దుస్థితి
∙తీవ్రజ్వరం, తలనొప్పితో కొంజుర్తి పెడెంపాలెం నివాసి మృతి
∙మృతదేహాన్ని డోలిలో తరలించిన బంధువులు


కళ్లెదుట తమ ఆత్మీయుడు మృత్యువుతో పోరాడుతుంటే ఆస్పత్రికి చేర్చలేని దయనీయ పరిస్థితి. ఉలకని పలకని 108..మూడు కిలోమీటర్లు దారుణ రహదారుల్లో డోలీలో తీసుకువచ్చి ఆటోలో ఆస్పత్రికి తరలించేలోగానే ఆ నడి వయస్కుడు అనంతలోకాలకు చేరాడు. సకాలంలో వైద్యం అంది ఉంటే ఆ అభాగ్యుడు బతికిఉండే వాడన్నది యథార్థం.

చోడవరం: ఆ గ్రామస్తులది దయనీయ పరిస్థితి. దారుణ రహదారితో వెతలకు గురవుతున్నారు. కొంజుర్తి సమీపంలోని పెడెంపాలెం గ్రామానికి రోడ్డు సదుపాయం లేదు. ఈ గూడేనికి రిగ్‌బోరు వెళ్లక పోవడంతో గొట్టపుబావి కూడా ఏర్పాటు కాలేదు. ఇక్కడి వారికి ఊటనీరే గతి. ఈ కారణంగా గ్రామస్తులు తరచూ వ్యాధులకు గురవుతున్నారు. ఆరోగ్య సిబ్బంది సేవలందిస్తున్నా నయం కావడంలేదు. ప్రస్తుతం గ్రామంలో పలువురు వ్యాధుల తో మంచానపడి విలవిల్లాడుతున్నారు.

ఈ స్థితిలోనే గ్రామానికి చెందిన సెగ్గే చినపోతురాజు(46)జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వాంతులు లక్షణాలతో నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గురువారం అర్ధరాత్రి నుంచి తలనొప్పి ఎక్కువైంది. వాంతులు కావడంతో తట్టుకోలేక పోయాడు. బంధువులు 108కు సమాచారం ఇచ్చారు.

ఖాళీ లేదంటూ ఆ సిబ్బంది చెప్పడంతో కల్యాణపులోవ వరకు మూడు కిలోమీటర్లు డోలీమోతగా తీసుకొచ్చారు. అక్కడి నుంచి కొత్తకోట మీదుగా రోలు గుంట ఆస్పత్రికి ఆటోలో తీసుకు వెళుతుండగా చనిపోయాడు. మృతదేహాన్ని కల్యాణపులోవ వరకు ఆటోలో అక్కడి నుంచి మళ్లీ మూడుకిలోమీటర్లు

డోలీమోతగా స్వగ్రామానికి తీసుకువెళ్లారు. చినపోతురాజుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆప్తుడ్ని కోల్పోయామన్న బాధ ఒక పక్క, సరైన రహదారి, రవాణా సౌకర్యం లేక డోలీమోతగా తీసుకువెళ్లడం మరో పక్క బంధువులను  కుంగదీస్తోంది. కుమిలి కుమిలి రోదిస్తున్నారు.
 
108 వచ్చి ఉంటే..
చినపోతురాజును ఆస్పత్రికి తరలించాలని శుక్రవారం తెల్లవారు జాము 2 గం టల నుంచీ ఫోన్‌ చేసినా వాహనం ఖా ళీ లేదంటూ సమాధానం వచ్చేదని, దీంతో డోలీ మోతగా కళ్యాణపులోవ వరకూ మోసుకువచ్చి ఆపై ఆటోలో రోలుగుంట తీసుకురావడానికి  మూడు గంటల సమయం పట్టిందని మృతు ని సోదరుడు పెద పోతురాజు తెలిపాడు. ఫోన్‌ చేసిన వెంటనే 108 వచ్చి ఉంటే తన తమ్ముడు బతికేవాడంటూ ఏడుస్తూ చెప్పాడు.

మరిన్ని వార్తలు