అన్నీ సం‘దేహా’లే..!

27 Sep, 2019 12:46 IST|Sakshi
బోటు ప్రమాదంలో గల్లంతైన కర్రి మణికంఠ మృతదేహం కోసం ఎదురుచూస్తున్న తల్లి, తండ్రి సోదరి, బంధువులు

మృతదేహాల కోసం మృతుల బంధువుల పడిగాపులు

మృతదేహం నుంచి రక్తనమూనాల సేకరణ

డీఎన్‌ఏ టెస్ట్‌ కోసం పంపించే ఏర్పాట్లు

తూర్పుగోదావరి ,రాజమహేంద్రవరం క్రైం: బోటు ప్రమాదంలో గల్లంతైన వారి మృతదేహాల కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో బంధువులు ఎదురు చూస్తున్నారు. వాడపల్లి వద్ద మంగళవారం లభించిన పురుషుడి మృతదేహం ఎవరిదనేది తేల్చేందుకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించేందుకు గురువారం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తనమూనాలు సేకరించారు. బోటు ప్రమాదంలో గల్లంతైన కాకినాడ సర్పవరం జంక్షన్‌కు చెందిన బోటు డ్రైవర్‌ పోతాబత్తుల సత్యనారాయణ(60) మృతదేహంగా అతడి కుమారుడు పోతాబత్తుల కుమార్‌ అంటుండగా, ఇదే బోటు ప్రమాదంలో గల్లంతైన బోటు సహాయకుడు పశ్చిమగోదావరి జిల్లా పాత పట్టిసీమకు చెందిన కర్రి మణికంఠ(24)దిగా అతడి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మృతదేహం నుంచి రక్త నమూనాలు సేకరించారు. వీటిని హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించి రిపోర్టు ఆధారంగా మృతదేహం సంబంధిత వ్యక్తులకు అప్పగించే ఏర్పాట్లు జరుగుతున్నాయని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయాధికారి టి.రమేష్‌ కిషోర్‌ తెలిపారు.

మృతదేహాల కోసం ఎదురుచూపులు
బోటు ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాల కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వారి కుటుంబసభ్యులు ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన అంకం పవన్‌ కుమార్, అతడి భార్య అంకం వసుంధరా భవానీ మృతదేహాల కోసం పవన్‌ కుమార్‌ మేనమామ రాజేంద్ర ప్రసాద్‌ ఎదురు చూస్తున్నారు. ఇతడిని రెవెన్యూ అధికారులు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి పిలిచి మృతదేహాల జాడ తెలిస్తే మీకు సమాచారం అందిస్తామని, మీరు వెళ్లవచ్చని అధికారులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. మృతదేహాల ఆచూకీ లభించే వరకూ ఇక్కడ నుంచి వెళ్లే ప్రసక్తే లేదని అధికారుల వద్ద అన్నారు. బోటు డ్రైవర్‌ పోతాబత్తుల సత్యనారాయణ కోసం అతడి తల్లి పోతాబత్తుల వెంకాయమ్మ, కుమారుడు పోతాబత్తుల కుమార్, ఇతర బంధువులు ఎదురు చూస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాత పట్టిసీమకు చెందిన కర్రి మణికంఠ మృతదేహం కోసం అతడి తండ్రి కర్రి నరసింహరావు, తల్లి పద్మావతి, సోదరి ఎదురు చూస్తున్నారు.

రక్త నమూనాల సేకరణపై స్పష్టత ఇవ్వని అధికారులు
వాడపల్లి వద్ద లభించిన మృతదేహం కోసం రెండు కుటుంబాల నుంచి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించేందుకు బంధువుల రక్త నమూనాలు సేకరిస్తామని బుధవారం సాయంత్రం పోలీసులు బాధిత కుటుంబాలకు తెలిపారు. గురువారం ఉదయం తొమ్మిది గంటకు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉండాలని సూచించారు. గురువారం ఉదయం తొమ్మిది గంటల్లోపే బాధిత కుటుంబాలు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నా వీరి రక్త నమూనాలు సేకరించలేదు. పైగా వీరికి సమయానికి రావాలని చెప్పిన అధికారులు సైతం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కనిపించకపోవడంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలవరం పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసి, ఎఫ్‌ఐఆర్‌ తీసుకు వస్తే విజయవాడలో రక్తసంబంధీకుల రక్త నమూనాలు సేకరించి డీఎన్‌ఏ పరీక్షలకు పంపిస్తారని అధికారులు పేర్కొంటున్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మూడు గుర్తు తెలియని మృతదేహలు ఇప్పటికే డీ కంపోజైన దృష్ట్యా వాటికి అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరిన్ని రోజులు మృతదేహాలు భద్రపరిస్తే వాటి వల్ల ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున వాటి నుంచి రక్త నమూనాలు సేకరించి భద్రపరుస్తున్నారు.

మరిన్ని వార్తలు