ఉద్యోగ విప్లవం

28 Jul, 2019 11:53 IST|Sakshi

నిరుద్యోగులకు ఉపాధి పండుగ

ఒక్కో సచివాలయంలో 10 మందికి అవకాశం

గ్రామ, వార్డు కార్యదర్శుల నోటిఫికేషన్‌పై హర్షం

సాక్షి కడప : ఉద్యోగాల కోసం..ఉపాధి కోసం కాళ్లరిగేలా తిరిగినా..కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసినా టీడీపీ హయాంలో ఫలితం కనిపించలేదు. కానీ రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార పగ్గాలు చేపట్టగానే ఒక్కో రంగాన్ని బలోపేతం చేస్తూ వస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి, పారిశ్రామిక విప్లవం, ఉద్యోగులు, ప్రజల సంతోషం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ప్రజా సంకల్ప పాదయాత్రలో  ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే ఉద్యోగాల విప్లవం  కళ్లేదుటే కనిపిస్తోంది. చరిత్రలో ఎప్పుడూ కనిపించని రీతిలో ఒక్కసారిగా ఉపాధికి పెద్దపీట వేయడంతో నిరుద్యోగులు పండుగ చేసుకుంటున్నారు. జిల్లాలో పది వేలకు పైగా కొత్త ఉద్యోగాలు కల్పించడం సంచలనంగా మారింది.

భారీగా ఉద్యోగాల భర్తీ
జిల్లాలో ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. టీడీపీ హయాంలో వంచనకు గురై ఉపాధి లేక ఎంతోమంది  బలవన్మరణాలకు  పాల్పడ్డారు. అయితే ప్రస్తుత వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఉపాధికి పెద్దపీట వేస్తూ ఎక్కడికక్కడ పరిశ్రమలు నెలకొల్పుతూ ప్రైవేటు రంగంలోనూ ఉపాధికి అవకాశాలు కల్పిస్తోంది. మరోవైపు గ్రామ సచివాలయ వ్యవస్థతో ప్రజల వద్దకే పాలన.. ఎవరూ కార్యాలయాల చుట్టూ తిరగకూడదన్న సంకల్పంతో ఉద్యోగాల నియామకాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.  గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల ప్రక్రియ ఆరంభించారు. అందులో భాగంగా ఉద్యోగాల భర్తీకి శుక్రవారం నోటీఫికేషన్‌ విడుదలైంది. పది విభాగాలకు సంబంధించి పదిమంది ఉద్యోగులను నియమించి వారి ద్వారా ప్రజలకు పలు రకాల సేవలందించనున్నారు. జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల్లో 10,610 ఉద్యోగాలు కల్పించనున్నారు. అందుకు సంబం«ధించి అధికారులు ప్రతిపాదనలు రూపొందించినా కొంచెం అటు, ఇటు పెరిగే అవకాశం ఉన్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

18 రకాల సేవలు..10 మంది ఉద్యోగులు
 వివిధ శాఖల ద్వారా ప్రజలకు 18 రకాల సేవలను గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అందించనుంది. ఆయా శాఖల పర్యవేక్షణలో వార్డు కార్యదర్శులు ప్రజలకు సేవలందిస్తారు. ఇందుకు తగ్గట్లే విద్యావంతులను పరీక్ష ద్వారా ఎంపిక చేసి ప్రతిభావంతులను వార్డు ఉద్యోగులుగా నియమిస్తారు. ఈ దిశగా నోటిఫికేషన్‌ విడుదల కావడంతో నిరుద్యోగులు దరఖాస్తు  చేయడం మొదలు పెట్టారు.  పెద్ద చదువులు చదివినా ఉద్యోగాలు లేక అవస్థలు పడుతున్న నిరుద్యోగులు దరఖాస్తు చేస్తున్నారు.  ఎందుకంటే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోకపోతే...వయస్సు దాటిపోయే ప్రమాదం ఉంది. గత ఐదేళ్లలో టీడీపీ ఆశించిన మేర ఉద్యోగాలు కల్పించకపోవడంతో నిరుద్యోగుల వయోపరిమితి దాటిపోతోంది. ప్రస్తుతం సచివాలయాల్లో పది మంది   పనిచేయనున్నారు. 18 రకాల సేవలను వారు అందించనున్నారు.

మున్సిపాలిటీలో 4 వేలు.....గ్రామ పంచాయతీలో 2 వేలకు ఒకటి చొప్పున..
జిల్లాలోని కడప కార్పొరేషన్, ఇతర మున్సిపాలిటీలతోపాటు గ్రామ పంచాయతీలకు సంబంధించి సచివాలయాలను వేర్వేరుగా విభజించారు. పంచాయతీరాజ్‌శాఖ పరిధిలో రెండు వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయం చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అయితే నాలుగు వేల జనాభాకు ఒక వార్డు సచివాలయం ఏర్పాటు దిశగా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జిల్లాలో కార్పొరేషన్, మున్సిపాలిటీలు, పంచాయతీలలో కలుపుకుని మొత్తం మీద 1061 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయనున్నారు. అయితే సచివాలయాల లెక్క మరికొంత పెరిగే అవకాశం కూడా లేకపోలేదు.

ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
జిల్లాలోని కడప కార్పొరేషన్‌తోపాటు అన్ని మున్సిపాలిటీల్లోని వార్డు సచివాలయాలకు,  పంచాయతీల్లోని గ్రామ సచివాలయాలకు సంబంధించి  నోటిఫికేషన్‌ వెలువడింది. పెద్ద ఎత్తున పోస్టులు ఉండడంతో నిరుద్యోగులకు ఉద్యోగ పండుగ అని చెప్పవచ్చు. ఎందుకంటే చాలాకాలంగా ఎదురుచూసి ఉద్యోగాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్న నిరుద్యోగులకు ఒక్కసారిగా వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించే నోటిఫికేషన్‌ వెలువడడంతో వారిలో ఆనందం వ్యక్తమవుతోంది.   

మరిన్ని వార్తలు