వంశ‘ధార’పారింది

5 Jul, 2014 03:49 IST|Sakshi
వంశ‘ధార’పారింది

ప్రధాన కాలువల ద్వారా సాగునీరు విడుదల
హిరమండలం: వంశధార కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా సాగునీటిని అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ఎస్‌ఈ బి.రాంబాబు ముందుగా వంశధార నదికి పూజలు నిర్వహించి నీరు విడిచిపెట్టారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వరినారుమడులు ఎండిపోతున్నాయన్న రైతుల కోరికతోపాటు, రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు నీరు విడిచి పెట్టామన్నారు.

నదిలో ఇన్‌ఫ్లో తక్కువగా వస్తున్నందు నీటిని రైతులు పొదుపుగా ఉపయోగించుకోవాలని సూచించారు. కుడికాలువ ద్వారా 55 కిలోమీటర్ల పరిధిలోని హిరమండలం, ఎల్.ఎన్,పేట, సరుబుజ్జిలి, బూర్జ, ఆమదాలవలస, గార, శ్రీకాకుళం మండలాల్లోని 62,280 ఎకరాలకు, ఎడమ ప్రధాన కాలువ ద్వారా 104 కిలోమీటర్ల మేర హిరమండలం, జలుమూరు.

టెక్కలి, పోలాకి, సంతబొమ్మాళి, పలాస, నరసన్నపేట, మెళియాపుట్టి, సారవకోట, కోటబొమ్మాళి, నందిగాం, వజ్రపుకొత్తూరు మండలాల్లోని 1.48 లక్షల ఎకరాలకు సాగునీరు అందజేయనున్నట్టు ఎస్‌ఈ పేర్కొన్నారు. కుడికాలువ ద్వారా 50 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 150 క్యూసెక్కులు నీటిని విడిచిపెడతామన్నారు. ఈ కార్యక్రమంలో వంశధార ఈఈ లు రామచంద్రరావు, మన్మథరావు, డీఈఈ ఎస్.జగదీశ్వరరావు, ఏఈఈలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు