12న ఓటర్ల జాబితా విడుదల

8 Jan, 2017 01:47 IST|Sakshi
12న ఓటర్ల జాబితా విడుదల

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌

అన్నవరం/రాజానగరం:  త్వరలో జరగనున్న ఐదు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈనెల 12వ తేదీన ఓటర్ల జాబితా ప్రకటిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ తెలియజేశారు. మూడు గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ, రెండు టీచర్స్‌ గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే మార్చి 29లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉందన్నారు. శనివారం ఆయన సతీసమేతంగా తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలోని రత్నగిరిపై సత్యదేవుని వ్రతమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా దేవస్థానంలోని సప్తగిరి అతిధి గృహంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎనిమిది లక్షల మంది కొత్త ఓటర్లు నమోదయ్యారని, వీరికి ఓటరు దినోత్సవం సందర్భంగా జనవరి 25వ తేదీన వారి కలర్‌ ఫొటోతో కూడిన ఓటరు కార్డులు పంపిణీ చేస్తారని తెలిపారు. తాను ఏ గుర్తుపై ఓటు వేసిందీ ఓటరుకు కనిపించేలా ఓటింగ్‌ యంత్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం మార్పులు చేస్తోందని  తెలిపారు. త్వరలో ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో ఈవి«ధానం అమల్లోకి వస్తోందన్నారు., 2019 సంవత్సరంలో జరిగే రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నాటికి ఇక్కడ కూడా వస్తాయని తెలిపారు.

సమర్థులను ఎన్నుకోండి  
యువతకు ఓటు హక్కు వినియోగంపై పూర్తి అవగాహన ఉండాలని, అప్పుడే సమర్థవంతవంతమైన పాలకులను ఎన్నుకునే వీలుంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని దివాన్‌చెరువులోని శ్రీప్రకాష్‌ విద్యానికేతన్‌లో భావిఓటర్లతో  శనివారం సాయంత్రం ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన ఓపిగ్గా సమాధానాలిచ్చారు.

మరిన్ని వార్తలు