రాజధాని రైతులకు ఊరట

27 Aug, 2019 18:17 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న రాజధాని ప్రాంత రైతులు

సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంత రైతులకు ఊరట కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు 187.44 కోట్ల రూపాయలు విడుదల చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రైతులకు కౌలు క్రింద ఈ మొత్తం విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ప్రభుత్వం నిధులు విడుదల చేయడం పట్ల రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీపై రైతుల ఆగ్రహం
రాజధాని తరలిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారంపై స్థానిక రైతులు మండిపడుతున్నారు. అమరావతిపై టీడీపీ, దాని అనుకూల మీడియా వారం రోజుల నుంచి విష ప్రచారం చేస్తుండటంతో రైతులు స్పందించారు. టీడీపీ సాగిస్తున్న అసత్య ప్రచారంతో రాజధానిలో భూముల ధరలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజధానిపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాని అనుకూల మీడియా చేస్తున్న విషప్రచారం ఆపకపోతే చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం తమ దగ్గర నుంచి భూములు లాక్కుని తమకు ఏమీ చేయలేదని వాపోయారు. రాజధానిపై అంత ప్రేమ ఉంటే ఒక్క శాశ్వత కార్యాలయం కూడా ఎందుకు కట్టలేదని టీడీపీ నాయకులను సూటిగా ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు భయటపడకుండా ఉండేందుకు, ఉనికిని చాటుకునేందుకు టీడీపీ నాయకులు విష ప్రచారం చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

చంద్రబాబు, ఆయన బినామీలు ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని రైతులు ఆరోపించారు. రాజధాని ఎక్కడ పెట్టాలన్న నిర్ణయం జరగకముందే టీడీపీ నాయకులు అమరావతిలో భూములు కొన్నారని రైతులు సాక్ష్యాలు చూపించారు. చంద్రబాబు, లింగమనేని రమేశ్‌, పయ్యావుల కేశవ్‌, ధూళిపాల నరేంద్ర, జీవీ ఆంజనేయులు, వేమూరి రవికుమార్‌ ప్రసాద్‌, కొమ్మాలపాటి శ్రీధర్‌, నారాయణ బినామీలు.. కోర్‌ క్యాపిటల్‌ ఎక్కడ వస్తుందో తెలుసుకుని ముందుగానే అక్కడ భూములు కొన్నారని రైతులు పూసగుచ్చినట్టు వివరించారు. (చదవండి: ఏపీ రాజధానిపై మహాకుట్ర!)

మరిన్ని వార్తలు