వలస  కుటుంబాలకు ఊరట 

2 Jan, 2020 04:41 IST|Sakshi

సాక్షి, అమరావతి: రేషన్‌ బియ్యం కార్డులున్న పేదలు దేశంలోని ఏ ప్రాంతంలోనైనా సబ్సిడీపై ఇచ్చే సరుకులు తీసుకునే వెసులుబాటు లభించింది. ముఖ్యంగా వలస కార్మికులు దీని వల్ల బాగా లబ్దిపొందుతున్నారు. ఈ విధానాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. ఎక్కడి నుంచైనా రేషన్‌ తీసుకునే విధానం (పోర్టబిలిటీ) ఇటీవలి వరకు కేవలం రాష్ట్ర పరిధిలో మాత్రమే ఎక్కడైనా తీసుకోవచ్చనే నిబంధన ఉండేది. అయితే వలస కూలీలను దృష్టిలో ఉంచుకొని ఏ రాష్ట్రంలోనైనా సరుకులు తీసుకోవచ్చనే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చింది.  

వ్యయప్రయాసలు తప్పాయి...
రాష్ట్రం నుండి ఎక్కువగా కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలకు పనుల కోసం వలసలు వెళ్తుంటారు. ఇలాంటి కూలీలకు ఎంతో ప్రయోజనం కలగుతోంది. ఇప్పటి వరకూ ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన కూలీల కుటుంబాల్లో ఒకరు అనేక వ్యయప్రయాసలతో సొంత రాష్ట్రానికి వచ్చి సరుకులు తీసుకెళ్లేవారు. గత కొద్ది నెలలనుంచీ ఆయా రాష్ట్రాల్లో కూడా తీసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన వారు తెలంగాణలోనూ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు ఆంధ్రప్రదేశ్‌లో పోర్టబిలిటీ విధానాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.

ఇదే తరహాలో ఇతర రాష్ట్రాల్లో కూడా సరుకులు తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 1.47 కోట్ల రేషన్‌ కార్డులు ఉంటే డిసెంబర్‌ నెలలో రాష్ట్రం పరిధిలోని వివిధ జిల్లాల్లో 31.48 లక్షల మంది పోర్టబిలిటీని వినియోగించుకున్నారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం కార్డులు, ఇతర జిల్లాల్లో సరుకులు తీసుకున్న వారి వివరాలిలా ఉన్నాయి. 

మరిన్ని వార్తలు