హా.. హస్తవిధీ!

4 Apr, 2014 01:17 IST|Sakshi
హా.. హస్తవిధీ!

సాక్షి, రాజమండ్రి : జిల్లాలో ఆరుసార్లు అత్యధిక స్థానాలు గెలుచుకుని, అందులో నాలుగుసార్లు స్వీప్ చేసిన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం విముఖత చూపుతున్నారు. మరీ బతిమాలితే రాజకీయ సన్యాసం చేశామంటున్నారే తప్ప పోటీకి మెత్తబడడం లేదు. గతంలో టిక్కెట్ల కోసం ఢిల్లీ స్థాయిలో యత్నించి, విఫలురైనవారిని ఈసారి పిలిచి టిక్కెట్ ఇస్తామన్నా ‘అబ్బే.. సీనియర్లుండగా మాకెందుకులెండి’ అంటూ తప్పుకొంటున్నారు.  
 
కాగా ఏ పార్టీ తమకు టిక్కెట్ ఇస్తే అందులోకి దూకడానికి సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో పలువురు సిద్ధంగా ఉన్నారు. జిల్లాలో ప్రజారాజ్యం నుంచి విలీనం అయిన వారితో కలిసి 15 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో రామచంద్రపురం, కొత్తపేట, జగ్గంపేట ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు,  బండారు సత్యానందరావు, తోట నరసింహం టీడీపీలో చేరిపోయారు. మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, కాకినాడ, హా.. ‘హస్త’విధీ!
 
రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రౌతు సూర్యప్రకాశరావు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. మిగిలినవారు కూడా ‘ఏ పార్టీ తలుపులు తెరిస్తే అటు దూకుతాం తప్ప కాంగ్రెస్ బీ ఫారం మాత్రం పుచ్చుకోం’ అంటూ తెగేసి చెబుతున్నారు. ‘జిల్లాలో జనం కాంగ్రెస్‌ను ఛీ అంటుంటే కోట్లు పారేసుకోలేం కదా’ అని బహిరంగంగానే చెబుతున్నారు.
 
పలుకు ఒకటి.. తలపు మరొకటి
పిఠాపురం ఎమ్మెల్యే వంగా గీత పైకి ఈసారి పోటీ చేయాలనే ఉద్దేశం లేదని చెబుతున్నా లోపల మాత్రం ఎవరు టిక్కెట్ ఇస్తారా అని ఎదురు చూస్తున్నట్టు సమాచారం.

పెద్దాపురం ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ టీడీపీలో సీటు పదిలం చేసుకునేందుకు ఇప్పటికే చంద్రబాబుతో టచ్‌లో ఉన్నట్టు సమాచారం.

అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి కూడా టీడీపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి పోటీ చేయాల్సిందిగా పీసీసీ వర్గాలు ఒత్తిడి తెస్తున్నా అంగీకరించని ఆయన పైకి మాత్రం తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పుకొస్తున్నారు.

ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ రాజకీయాలకు దూరంగా ఉంటానని చెబుతున్నా ఓరకంట టీడీపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది.

పి.గన్నవరం ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి కాంగ్రెస్ తప్ప ఏ పార్టీ టిక్కెట్ ఇచ్చినా.. పోటీకి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఒకవేళ తనకు ఇవ్వకుండా.. కుమారుడికిచ్చినా సమ్మతమేనంటున్నారు.

రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ బీజేపీ గడప తొక్కాలని హైదరాబాద్‌లో ఉండి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. టీడీపీ, బీజేపీ పొత్తులు కుదిరితే రాజోలు సీటు బీజేపీకి వచ్చేలా పట్టుబట్టవచ్చన్నది ఆయన అభిమతంగా తెలుస్తోంది.

రంపచోడవరం ఎమ్మెల్యే కోసూరి కాశీ విశ్వనాథ్ మాత్రం కాంగ్రెస్ టిక్కెట్ ఇస్తే పోటీ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.
తుని ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబు రాజకీయాలకు దూరంగా ఉంటానంటున్నా అధిష్టానం మరీ బతిమాలితే పోటీ చేస్తారని సన్నిహితులు అంటున్నారు.

సట్టింగ్‌లందరితోనూ మాటామంతీ జరుపుతున్న పీసీసీ బృందం సమయం ఎక్కువగా లేకపోవడంతో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుతో పాటు ఇంకా పార్టీలో కొనసాగుతున్న వారందరినీ అదే స్థానం నుంచి పోటీలోకి దిగాలని ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు