ఉద్రిక్తత నడుమ హైస్కూల్‌ స్థలం ఆక్రమణల తొలగింపు

11 May, 2019 10:26 IST|Sakshi
చోడవరం హైస్కూల్లో ఆక్రమణలు తొలగిస్తున్న అధికారులు

చోడవరం టౌన్‌: చోడవరం ప్రభుత్వ హైస్కూల్‌ ఆవరణలో ఆక్రమణల తొలగింపు శుక్రవారం ఉద్రిక్తతల నడుమ సాగింది. ఆక్రమణలు తొలగించాలంటూ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో రెవెన్యూ యంత్రాంగం శుక్రవారం ఉదయం తొలగింపు కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణ ఆక్రమణకు గురైందని పట్టణానికి చెందిన బీజేపీ సీనియర్‌ నాయకుడు ఏఆర్‌జీ శర్మతో పాటు మరో నలుగురు హై కోర్టుని ఆశ్రయించారు. ఆక్రమణలు మూడు నెలల్లోగా తొలగించాలని దీంతో ఈ ఏడాది జనవరిలో హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే సార్వత్రిక ఎన్నికల కారణంగా ఇప్పటి వరకూ జాప్యం జరిగింది. ఆక్రమణల తొలగింపులో ఎటువంటి ఉద్రిక్తత జరగకుండా రెవెన్యూ అధికారులు, పో లీసులు 144 సెక్షన్‌ విధించారు.

సుమారు 100 మంది సిబ్బందిని అక్కడ మోహరించి పొక్లెయి న్‌తో ఆక్రమణలు తొలగింపు చేపట్టారు. కొం దరు మహిళలు ఆడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు, రెవెన్యూ అధికారులు వారితో చర్చలు జరిపి అక్కడ నుంచి పంపించివేశారు. కాగాపాఠశాల ఆవరణలో సుమారు 29 మంది ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేశామని, వారు ఆ నోటీసులు బేఖాతరు చేయడంతో స్థానికులు కొందరు హైకోర్టుని ఆశ్రయించారని తహసీల్దార్‌ రవికుమార్‌ తెలిపారు. తరువాత హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆక్రమణలు తొలగింపు చేపట్టామన్నారు. సర్వే నంబరు 72లో పాఠశాలకు 7ఎకరాల 23 సెంట్లు స్థలం ఉండగా దీనిలో 1094 గజాలు స్థలం ఆక్రమణకు గురయ్యిందన్నారు. ప్రస్తుతం 1094 గజాల్లో 500 గజాలు ఖాళీ స్థలం ఉండగా 594 గజాల్లో పక్కా కట్టడాలు ఉన్నాయని తెలిపారు. వీటిలో కొంత పొక్లెయిన్‌తో తలగించగా, మరి కొందరు ఆక్రమణలు తామే స్వచ్ఛందంగా తొలగిస్తామని గడువు కోరడంతో వారికి సమయం కేటాయించామని తెలిపారు. 

మరిన్ని వార్తలు